ఇల్లెందు, జూన్ 22: ప్రభుత్వ పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. యంత్రాంగం ఇప్పటికే ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను గుర్తించింది.. ఇక నోటిఫికేషన్లు లాంఛనమే.. అందరికీ ఇది శుభకృత్ నామ సంవత్సరం అయినప్పటికీ నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగ నామ సంవత్సరం.. ఇప్పటికే గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల కాగా ప్రిలిమ్స్ పరీక్షకు తేదీ ఖరారైంది.. మరికొద్ది రోజుల్లో గ్రూప్స్, పోలీస్ కొలువుల భర్తీకి పరీక్షలు జరగనున్నాయి.. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు ఉచితంగా పోటీపరీక్షలకు శిక్షణ ఇప్పించేందుకు ముందుకు వచ్చారు ఎమ్మెల్యే హరిప్రియ. ఇల్లెందు పట్టణంలో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి నిష్ణాతులైన ఫ్యాకల్టీతో తరగతులు నిర్వహిస్తున్నారు.. ఉచితంగా స్టడీ మెటీరియల్, భోజనం, హాస్టల్ వసతి కల్పిస్తున్నారు..
ఈ ఏడాది ఉద్యోగ నామ సంవత్సరం. ఇది అక్షరాలో నిజం. రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ కొలువుల భర్తీకి భారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి విదితమే. ఇప్పటికే గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల కాగా ప్రిలిమ్స్ పరీక్షా తేదీ ఖరారైంది. మున్ముందు పోలీస్‌శాఖతో పాటు గ్రూప్-2, 4 నోటిఫికేషన్లూ విడుదల కానున్నాయి. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే హరిప్రియ ప్రత్యేక చొరవ తీసుకుని ఇల్లెందులో ‘హరిప్రియ ఫౌండేషన్’ ఏర్పాటు చేశారు. పట్టణంలోని ఆర్అండ్ఆర్ కాలనీలో కోచింగ్ సెంటర్ అందుబాటులోకి తీసుకొచ్చారు. నియోజకవర్గానికి చెందిన సుమారు వెయ్యి మంది నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. సుమారు వంద మందికి భోజన , హాస్టల్ వసతి కల్పిస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వందలాది మంది కౌన్సిలింగ్‌కు హాజరయ్యారు. నిష్ణాతులైన ఫ్యాకల్టీ ప్రతిరోజూ వారికి తరగతులు నిర్వహిస్తున్నారు.
నిరుపేద విద్యార్థులకు మేలు..
ఇల్లెందు నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. నియోజకవర్గానికి దగ్గరలో మరో మూడు నియోజకవర్గాల పరిధిలోని మండలాలు ఉంటాయి. ఈప్రాంతానికి చెందిన విద్యార్థులంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. పోటీపరీక్షలకు సిద్ధమయ్యేవారు గతంలో వ్యయప్రయా సలకోర్చి ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లేవారు. అక్కడ కోచింగ్ తీసుకోవడం డబ్బుతో కూడుకున్న విషయం కావడంతో ఎక్కువ మంది స్థానికంగానే ఉంటూ అరకొర వసతుల మధ్య ప్రిపేర్ అయ్యేవారు. వారందరి కోసం హరిప్రియ ఫౌండేషన్ ఇల్లెందులో ప్రత్యేక భవనం నిర్మించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు కోచింగ్ సెంటర్ వరకు కోచింగ్ సెంటర్ కొనసాగనున్నది. గ్రూప్స్‌తో పాటు కానిస్టేబుల్, ఎస్సై కొలువులు సాధించాలనుకునే వారికి ఈ కోచింగ్ చక్కటి అవకాశం.
సకల సదుపాయాలు కల్పిస్తాం..
హరిప్రియ ఫౌండేషన్ ద్వారా పేద, నిరుపేద విద్యార్థులకు అండగా నిలుస్తాం. నిరుద్యోగుల కోసం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రత్యేక భవనం నిర్మించాం. ఇక్కడ పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇస్తాం. వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తాం. ప్రతి అభ్యర్థికి స్టడీ మెటీరియల్ అందిస్తాం. ఈ అవకాశాన్ని ఏజెన్సీ ప్రాంత అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి.
– ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్