భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 22 (నమస్తే తెలంగాణ):మోతాదుకు మించి రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం.. ఒకే రకం పంటల సాగు.. మెలకువలు పాటించకుండా మూస పద్ధతిలో సాగు చేయడం భూసారానికి ముప్పు.. భూమి స్వభావాన్ని తెలుసుకుని, దానిలో పోషక విలువలను గుర్తించి సాగు చేపడితే మెరుగైన ఫలితాలు వస్తాయి.. వరి సాగులో వెదజల్లే పద్ధతి పాటిస్తే పెట్టు బడి ఖర్చులు తగ్గుతాయి.. పచ్చిరొట్ట సాగు చేస్తే భూసారం పెరుగు తుంది.. ఎరువుల ఖర్చు తగ్గుతుంది.. సాధారణ పంటల కంటే కంది, పత్తి సాగు ఎంతో మేలు.. పత్తి సాగులో అధిక సాంద్రత విధానంతో లాభం.. జీవ ఎరువులు, సేంద్రియ ఎరువుల వినియోగం పంటకు ప్రాణం.. ఇలాంటి సాగు సూత్రాలు అధిక దిగుబడులకు మార్గాలు.. వాటిపై ‘నమస్తే ’ప్రత్యేక కథనం. –
పంటల సాగులో మెలకువలు పాటిస్తే సాగులో దిగుబడి పక్కాగా ఉంటుంది. మంచి లాభాలు గడించాలనే ఉద్దేశంతో వ్యవసాయశాఖ అధికారులు రైతులు పంచ సూత్రాలపై అవగాహన కల్పిస్తున్నారు. మూస పద్ధతిలో కాకుండా సాగులో మార్పులు పాటించి మంచి ఫలితాలు సాధించవచ్చంటున్నారు. ఇప్పటికే వానకాలంలో పత్తి, కంది విస్తీర్ణం పెంచేందుకు అవగాహన కల్పించారు.
మొదటి సూత్రం..
మెట్ట, తడినారు లేకుండా వరి నేరుగా విత్తడం..
రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ మంది రైతులు దమ్ము చేసిన పొలాల్లోనే వరి నాట్లు వేస్తున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా రుతుపవనాల తాకిడి సమయానికి రాకపోవడంతో ప్రధాన జలాశయాలు, చెరువులు, కుంటల్లో నీరు లేకపోవడం, వ్యవసాయ కూలీల కొరత, పెరిగిన కూలి రేట్లు, దమ్ముకు పెరిగిన ట్రాక్టర్ల కిరాయితో పాటు ఇతర పెట్టుబడి ఖర్చుల కారణంగా వరి సాగు లాభదాయకంగా ఉండడం లేదు. ఈ సమస్యలకు ఒక్కటే పరిష్కారం దమ్ము చేయకుండా నేరుగా వడ్లు విత్తడం మేలు.
రెండో సూత్రం..
పంటకు కావాల్సిన వివిధ పోషకాల్లో భాస్వరం చాలా ముఖ్యమైనది. ఈ పోషకం వేర్ల పెంపకం, మొక్క ఎదుగుదలకు చాలా అవసరం. రైతాంగం ఈ పోషకాన్ని డీఏపీ, భాస్వరం కలిగిన కాంప్లెక్స్ ఎరువుల ద్వారా పంటకు అందజేస్తున్నారు. భాస్వరం భూమిలో వేసినప్పుడు త్వరగా పంటకు లభ్యం అయ్యే స్థితిలో ఉండదు. ఈ కారణంతో దశాబ్దాలుగా రైతాంగం విచక్షణా రహితంగా భాస్వరం ఎరువులు వినియోగిస్తున్నారు. భాస్వరాన్ని కరిగించేందుకు ఎకరానికి 2 కిలోల ఘన జీవన ఎరువు లేదా 200 మి.మీ ద్రవ జీవ ఎరువును సుమారు 100-200 కిలోల పశువుల ఎరువు లేదా సేంద్రియ ఎరువుతో పంట పొలాల్లో వేయాలి.
మూడో సూత్రం..
రైతులు ఎకరానికి సుమారు ఎనిమిది కిలోల వరకు పచ్చిరొట్ట విత్తనాలు చల్లుకోవాలి. ఇది సుమారు ఆరు టన్నుల పచ్చిరొట్టనిస్తుంది. ఒక టన్ను పచ్చిరొట్టలో సుమారు ఏడు కిలోల నత్రజని, ఒక కిలో భాస్వరం, 5 కిలోల పొటాష్ ఉంటుంది. పచ్చిరొట్ట ఎరువుగా, పశువుల మేతగా వాడొచ్చు. అలసంద, పిల్లిపెసర, పెసర, జనుము, జిలుగులు పచ్చిరొట్టగా వాడతారు. తొలకరి వర్షాలకు వీటిని చల్లుకొని కాయలు కోసిన తరువాత మిగిలిన రొట్టను భూమిలో కలియదున్నుకుంటారు. దీంతో భూమి మరింత సారవంతమవుతుంది. పచ్చిరొట్ట పైర్లను నేలలో కలియదున్నేటప్పుడు తగినంత తేమ ఉండేలా చూడాలి. కలియదున్నిన తరువాత కుళ్లేటప్పుడు వాటిలో కొన్ని రకాలైన ఆమ్లాలు తయారవుతాయి. కాబట్టి రెండు వారాలు కుళ్లిన తరువాతే ప్రధాన పంటలు సాగు చేయాలి. తక్కువ ఖర్చుతో నేలకు సేంద్రియ పదార్థాన్ని ఎక్కువ మోతాదులో అందించే వీలు కలుగుతుంది.
నాలుగో సూత్రం..
ప్రధాన పోషకాలను భూసార పరీక్షల ఆధారంగా వాడుకుంటే అధిక లాభాలు పొందవచ్చు. వ్యవసాయశాఖ సాధారణంగా ఎకరానికి 48: 20: 16 కిలోల నత్రజని: భాస్వరం: పొటాష్ సిఫార్సు చేస్తున్నది. మొత్తం భాస్వరం, సగభాగం పొటాష్‌ను ఆఖరి దుక్కిలో విత్తుకున్నప్పుడు వేసుకోవాలి. నత్రజని ఎరువులను మూడు సమభాగాలుగా విత్తిన 15 నుంచి 20 రోజులకు పిలక, అంకురం దశలో వేసుకోవాలి. ఆఖరి నత్రజని ఎరువులతో పాటు పొటాష్ ఎరువుల వాడకం తప్పనిసరి. ఈ పద్దతిలో ఇనుపధాతు లోపం రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రైతులు ఆకులు తెల్లగా పాలిపోయి పంట ఎదుగుదల కుంటుపడినట్లు అనిపిస్తే లీటర్ నీటికి 5 గ్రాములు, అన్నభేది 1 గ్రాము, నిమ్మ ఉప్పు కలిపి అవసరాన్ని బట్టి రెండు మూడు సార్లు పిచికారీ చేసుకోవాలి.
ఐదో సూత్రం..
ఈ సీజనల్లో పత్తి, కంది పంటల విస్తీర్ణం పెంచేందుకు వ్యవసాయశాఖ కృషి చేస్తున్నది. ఇప్పటికే కరపత్రాల ద్వారా ప్రచారం జరుగుతున్నది. మరోవైపు వ్యవసాయశాఖ అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు విధానాన్ని ప్రోత్సహిస్తున్నది. గత వానకాలంలో పత్తి 1,60,548 ఎకరాలు, కంది 11,519 ఎకరాల విస్తీర్ణంలో సాగు కాగా, ఈ వానాకాలం 2022 కాలానికి పత్తి 1,77,619 ఎకరాలు, కంది 15,122 ఎకరాల విస్తీర్ణంలో సాగు కానున్నది. ఈ పంటలకు ప్రభుత్వం మద్దతు ధర కూడా ఇస్తున్నది.
పంచ సూత్రాలు పాటిస్తే అధిక దిగుబడులు..
రైతులు పంటల సాగులో మెలకువలు నేర్చుకోవాలి. ఎప్పుడూ మూస పద్ధతిలో సాగు చేయకూడదు. కొత్త పద్ధతిలో పంటలు సాగు చేస్తే భూసారం పెరుగుతుంది. పంటలకు చీడపీడల బాధ తప్పుతుంది. అందుకే ఈ ఐదు సూత్రాలు రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
– కొర్సా అభిమన్యుడు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, కొత్తగూడెం