ముదిగొండ, జూన్ 22: ఒకప్పుడు పెద్ద మండవ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. 3,251 జనాభా ఉన్న గ్రామంలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి దుర్గంధం వ్యాపించేంది. వానకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలి గ్రామస్తులు రోగాల పాలయ్యేవారు. సమస్యలతోనే నిత్యం సహవాసం. పల్లె ప్రగతి అమలులోకి వచ్చిన తర్వాత గ్రామ రూపురేఖలు మారిపోయాయి. ప్రభుత్వ లక్ష్యాల మేరకు పని చేసి పాలకవర్గం గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపింది. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించి గ్రామాన్ని పరిశుభ్రతకు కేరాఫ్‌గా మార్చింది. పంచాయతీ సిబ్బంది ప్రతిరోజూ ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డుకు చెత్త తరలిస్తున్నారు. యార్డులో తడి, పొడి చెత్తను వేరు చేసి ఎరువులు తయారు చేస్తున్నారు. ఎరువులను హరితహారం మొక్కలకు వినియోగిస్తున్నారు. మిగిలిన ఎరువును రైతులకు విక్రయిస్తున్నారు.
పచ్చందాల పల్లె..
పాలకవర్గం మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది. గ్రామ నర్సరీలో 16,500 మొక్కలు, పల్లె ప్రకృతి వనంలో 2,000 మొక్కలు, అవెన్యూ ప్లాంటేషన్‌లో 600 మొక్కలు, వైకుంఠధామంలో 200 మొక్కలు పెంచుతున్నది. పంచాయతీ సిబ్బంది ప్రతిరోజు ట్యాంకర్ ద్వారా మొక్కలకు నీరు పెడుతున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. ఉదయం, సాయంత్రం పిల్లలు అక్కడ ఆహ్లాదంగా సమయం గడుపుతున్నారు. గ్రామ నర్సరీలో ఉసిరి, సీతాఫలం, నిమ్మ, గానుగ, నిమ్మ వంటి పండ్ల మొక్కలతో పాటు గులాబీ, మల్లె వంటి పూల మొక్కలూ పెరుగుతున్నాయి. ఇక్కడ పెరిగిన మొక్కలు హరితహారానికి ఉపయోగపడుతున్నాయి. టేకు మొక్కలు పెంచుకునే ఆసక్తి ఉన్న రైతులకు ఇక్కడి నుంచి మొక్కలు అందుతున్నాయి. ప్రతి పంచాయతీకి ఎనిమిది మంది మల్టీ పర్పస్ వర్కర్లను నియమించుకునే వెసులుబాటు కల్పించడంతో ట్రాక్టర్ డ్రైవర్, ఎలక్ట్రీషియన్, పారిశుధ్య సిబ్బంది అందుబాటులోకి వచ్చారు. వీరందరికీ నెల నెలా ప్రభుత్వమే జీతాలు ఇస్తున్నది. గ్రామంలో అన్ని వసతులతో వైకుంఠధామం అందుబాటులోకి వచ్చింది.
అన్నిరంగాల్లో ముందంజ..
పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామం పరిశుభ్రంగా మారింది. గతంలో పట్టణాలకే పరిమితమైన పార్క్‌లు ఇప్పుడు పల్లెలకూ చేరువయ్యాయి. జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సద్వినియోగం చేసుకుని గ్రామాన్ని అభివృద్ధి బాట పట్టించాం. గతంలో పని చేసే సంకల్పం ఉన్నా నిధులు సరిపోయేవి కావు. ఇప్పుడు ప్రభుత్వం నెలనెలా పక్కాగా నిధులు విడుదల చేస్తున్నది. ఈ నిధులతో గ్రామాన్ని అన్నిరంగాల్లో ముందంజలో నిలుపుతున్నాం.
– శట్టిపోగు నర్సింహారావు, సర్పంచ్, పెద్ద మండవ