భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : జనావాసాల మధ్య పందుల సంచారం లేకుండా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. బుధవారం పట్టణ ప్రగతి కార్యక్రమాలపై మున్సిపల్ చైర్మన్లు, ప్రత్యేక అధికారులు, కమిషనర్లు, మున్సిపల్ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. జనావాసాల మధ్య పందుల సంచారం లేకుండా చేయాలని పలుమార్లు చెప్పినప్పటికీ ఎందుకు పట్టించుకోవడం లేదని మున్సిపల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరాలుగా సమస్య అలాగే ఉందని, మిషన్ మోడ్‌తో పందులను తొలగించి పందుల సంచారం లేని మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు.
ఇంటింటి నుంచి వ్యర్థాల సేకరణ కార్యక్రమం పకడ్బందీగా జరగాలని చెప్పారు. ఈ దఫా హరితహారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అవెన్యూ, మల్టీపర్సస్ మొక్కలు పెద్దఎత్తున నాటాలని, మున్సిపాలిటీల్లోని ప్రధాన, అంతర్గత రహదారుల్లో ప్లాంటేషన్ చేయాలన్నారు. కుక్కల వృద్ధిని అరికట్టేందుకు కు.ని ఆపరేషన్లు నిర్వహించాలని చెప్పారు. పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో బల్లలు ఏర్పాటు చేయడం పట్ల మున్సిపల్ కమిషనర్‌ను అభినందించారు. సమావేశంలో కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపల్ చైర్మన్లు కాపు సీతాలక్ష్మి, డి.వెంకటేశ్వరరావు, పట్టణ ప్రగతి ప్రత్యేక అధికారులు, కమిషనర్లు నవీన్, శ్రీకాంత్, అంకుషావలి, మాధవి, డీఈలు, పారిశుధ్య అధికారులు పాల్గొన్నారు.