ఖమ్మం వ్యవసాయం/ కొణిజర్ల, జూన్ 2: రైతులు మార్కెట్‌కు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టిసారించాలని రాష్ట్ర ఉద్యాన వన శాఖ ఉప సంచాలకుడు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయిల్‌పాం పర్యవేక్షణ అధికారి ఎంవీ మధుసూదన్ సూచించారు. ఖమ్మం జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి జీ.అనసూయతో కలిసి కూసుమంచి, కొణిజర్ల, పెనుబల్లి మండలాల్లో ఆయిల్‌పాం సాగు చేస్తున్న రైతుల క్షేత్రాలను బుధవారం సందర్శించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వరికి ప్రత్యామ్నాయంగా సాగు ఖర్చు తక్కువ, కోతుల బెడద లేని, తక్కువ చీడపీడలు ఆశిస్తూ ఒకసారి నాటితే 30 ఏళ్ల వరకూ ఆదాయం వచ్చే ఆయిల్‌పాం పంట సాగు చేపట్టాలని తెలిపారు. ఆయిల్‌పాం సాగు మెళకువలు, నీటి – ఎరువుల యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి వివరించారు. ఆయిల్‌పాం తోటలో అంతరపంటగా కోకో, కూరగాయలు, మిరియాలు, పూలపంటలు సాగు చేసుకొని అదనపు ఆదాయం పొందవచ్చునని సూచించారు. సహాయ సంచాలకురాలు కే.అనిత, ఉద్యాన అధికారులు జీ.సందీప్‌కుమార్, జీ.నగేశ్, అపర్ణ, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.