ఇల్లెందు, జూన్ 21: సింగరేణి ఇల్లెందు ఏరియాలో ఉత్పత్తి అవుతున్న బొగ్గు.. దేశ వ్యాప్తంగా వివిధ విద్యుదుత్పత్తి కేంద్రాలకు సరఫరా అవుతోంది. జేకే 5, కోయగూడెం ఓపెన్కాస్టులే ప్రస్తుతం ఇల్లెందు ఏరియాను నడిపిస్తున్నాయి. వందకు నూట పది శాతం బొగ్గును ఉత్పత్తి చేస్తూ ఇల్లెందు ఏరియాను అగ్రభాగాన నిలుపుతున్నాయి. రోజుకు ఇల్లెందు సీహెచ్పీ నుంచి నాలుగు రేకులు చొప్పున బొగ్గు రవాణా చేస్తున్నారు. ఇల్లెందు సీహెచ్పీ నుంచి నాలుగు రేకులు, తడికెలపూడి నుంచి మరో రెండు రేకులు సరఫరా జరుగుతున్నాయి. రేకుకు 3,500 నుంచి 3,600 టన్నులు వరకు రవాణా చేస్తారు. ఆరు రేకులకు గాను రోజుకు 21 వేల టన్నుల బొగ్గు రవాణా జరుగుతోంది. మరో మూడు వేల టన్నుల బొగ్గు.. రోడ్డు రవాణా ద్వారా ఇతర ప్రాంతాలకు తరలివెళ్తోంది. నిజానికి ఇల్లెందు ఏరియాలో రోజు కు 21 వేల టన్నులు మాత్రమే బొగ్గు ఉత్పత్తి అవుతోంది. కొత్తగూ డెం నుంచి రోజుకు మూడు వేల ట న్నుల బొగ్గు టేకులపల్లి మండలం తడికెలపూడి వద్దకు వస్తుంది. అక్క డి నుంచి ఇల్లెందు ఏరియా బొగ్గు రవాణాలో భాగమవుతుంది.
జీ-13, 15 గ్రేడుల బొగ్గు ఉత్పత్తి..
2020-21 ఆర్థిక సంవత్సరంలో 49,23,514 టన్నుల బొగ్గును రవాణా చేసి ఇల్లెందు ఏరియా చరిత్ర సృష్టించింది. అంతకంటే ఎక్కువ చేసిన ఏరియాలు ఉన్నప్పటికీ రెండు ఓసీలతో రికార్డులు సృష్టించిన ఘనత ఇల్లెందుకు దక్కింది. ప్రధానంగా ఇక్కడ గ్రేడు జీ-13, 15లతో దూసుకుపోయింది. 765 జెన్కో, రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్, చంద్రాపూర్ పవర్ స్టేషన్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్, విజయవాడ థర్మల్ వపర్ స్టేషన్, ఏపీ జెన్కో, కోరాడీ థర్మల్ పవర్ స్టేషన్లకు ఇల్లెందు బొగ్గు సరఫరా అవుతోంది. తెలంగాణలో ఒకటి, రెండు మినహా దేశ వ్యాప్తంగా ఇల్లెందు ఏరియా నుంచి బొగ్గు రవాణా జరిగింది. కరోనా లాక్డౌన్ తర్వాత కూడా ఆయా రాష్ర్టాలకు ఇల్లెందు బొగ్గే ఆదెరువుగా మారింది. 2021-22లో 59,33,206 టన్నుల ఉత్పత్తిని సాధించి దేశ వ్యాప్తంగా బొగ్గును రవాణా చేసి రూ.657 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఇల్లెందు ఏరియా ఉత్పత్తి, ఉత్పాదకతను సీఎండీ శ్రీధర్ పలుమార్లు అభినందించారు. ఇల్లెందు సీహెచ్పీను ఏటా అభినందనలతో ముంచెత్తుతుంటారు. కార్మికులకు ప్రోత్సాహక బహుమతులూ అందించారు. కేవలం రెండు ఓసీలు, సుమారు 500 మంది కార్మికులతో రోజుకు 5 రేకుల చొప్పున ఉత్పత్తి చేసిన ఘనత ఇల్లెందు ఏరియాకే సాధ్యమైంది.
ఈ ఏరియాకు మరింత భవిష్యత్తు..
ఇల్లెందు ఏరియాకు మరింత భవిష్యత్ ఉంటుంది. ప్రస్తుతం రెండు ఓసీలు మాత్రమే నడుస్తున్నాయి. భవిష్యత్లో జేకే-5 ఓసీని విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. మరో ఆరు నెలల్లో ఓబీ తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫలితంగా మరింత ఇల్లెందు ఏరియాకు గుర్తింపు రానుంది. ఇప్పటి వరకు సాధించిన ఉత్పత్తి కంటే ఓసీ విస్తరణ తర్వాత పెద్ద ఎత్తున ఉత్పత్తి, ఉత్పాదకత జరుగుతుంది. అధికారులు, కార్మికుల సహకారంతోటే ఏరియాను అగ్రభాగంలో ఉంచుతున్నాం.
-ఇల్లెందు ఏరియా జీఎం, షాలెంరాజు