మామిళ్లగూడెం, జూన్ 21: ప్రభుత్వ పాఠశాలల బలోపేతం దిశగా చర్యలు చేపట్టినట్లు ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు పేర్కొన్నారు. ఖమ్మంలోని జడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘మన ఊరు – మన బడి’ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. బడి బాట కార్యక్రమానికి ఇంకా సమయం ఉన్నందున పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్ల పెంపునకు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలన్నారు. సీజనల్ వ్యాధులపై మండల పరిషత్‌లలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి సిద్ధంగా ఉండాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నందున సర్కారు వైద్య సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వర్షాకాలం దృష్ట్యా దోమల నియంత్రణకు ముందుస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లక్ష్యం మేరకు హరితహారం విజయవంతం చేయాలన్నారు.
పాఠశాలలపైప్రత్యేక దృష్టి : కలెక్టర్
ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో మంచి సమాజాన్ని తీర్చిదిద్దాలనే సంకల్పంతో సర్కారు పాఠశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, ఇతరత్రా లోటు పాట్లు సరిదిద్దుకొని బడులను అన్ని విధాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో హాజరు 70 వాతం ఉందని, ఇంకా బడి బయట ఉన్న పిల్లలను బడులకు రప్పించే చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాలో ఉపాధ్యాయుల కొరత లేదని, విద్యార్థుల సంఖ్యను బట్టి అవసరం ఉన్న చోట్ల ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను చేపడతామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం బోధిస్తున్న విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. పాఠశాలల్లో విద్యార్థులు సంఖ్యకు అనుగుణంగా వసతుల కల్పించాలని సూచించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, హరితహారం కార్యక్రమాలపై అధికారులు ప్రగతి నివేదికలు వివరించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు. అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, జడ్పీ సీఈవో వీవీ అప్పారావు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.