భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 17 (నమస్తే తెలంగాణ)/ ఖమ్మం వ్యవసాయం: రైతులు సాగులో సరికొత్త ఒరవడి సృష్టించినప్పుడే వారు ఆశించిన లాభాలు వస్తాయి. కొన్నేళ్లుగా ఆయా రకాల పంటల సాగులో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రైతులు వరిలో వెదజల్లే పద్ధతి మాదిరిగానే ఇక నుంచి పత్తి సాగులో ఈ విధానం అవలంబించనున్నారు. ఇక మీదట ఒకే రకమైన పద్ధతిలో పత్తి విత్తనాలు విత్తుకోవడం, ఒకటి, రెండు క్వింటాళ్ల పత్తి చొప్పున ఏరుకోవడం, నెలల తరబడి పురుగు మందులు కొట్టడం లాంటి మూస పద్ధతికి ఇక స్వస్తి పలకనున్నారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటి ఒకేసారి పంటను తీసుకునే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యవసాయశాఖ పత్తి సాగులో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది.
ఈ విధానాన్ని వానకాలం సీజన్లో ప్రారంభించనున్నది. ఇది కేవలం ఇతర దేశాల్లో సాగు అవుతుండగా.. ఈ ఏడాది నుంచి తెలంగాణలో ప్రయోగాత్మకంగా సాగు చేసేందుకు వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ మేరకు ఆసక్తి కలిగిన రైతుల వివరాలు సేకరిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ప్రయోగాత్మకంగా 1,150 ఎకరాలు, భద్రాద్రి జిల్లాలో 590 ఎకరాల్లో కొత్త పద్ధతిలో (అధిక సాంద్రతలో పత్తి) సాగు చేయనున్నారు. ఇక నుంచి ఎకరా విస్తీర్ణంలో రికార్డు స్థాయిలో 25వేల మొక్కలు పెరగనున్నాయి.
రైతులు సాగులో సంప్రదాయ పద్ధతులు విడనాడి ఆధునిక పద్ధతులు అవలంబించినప్పుడే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొందరు రైతులు వరిలో వెదజల్లే పద్ధతి పాటించి అధిక దిగుబడులు సాధించారు. పత్తి సాగులోనూ కొత్త పద్ధతి అవలంబించి ఆర్థికంగా వృద్ధి చెందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఈ పద్ధతిని అమలు చేస్తున్నది. నూతన పద్ధతిలో రైతులు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటుకునే అవకాశం ఉంది. పంట చేతికి వచ్చిన తర్వాత ఒకేసారి పత్తి తీసుకునే విధంగా వీలుగా ఉంటుంది. ఈ పద్ధతికి అధిక సాంద్రతలో పత్తి సాగు అని పేరు. తేలిక పాటి నేలలు, ఎర్ర చెలక నేలలు కొత్త పద్ధతి సాగుకు అనుకూలం.
సాగు విధానంపై ఇప్పటికే హైదరాబాద్‌లో ఏడీఏలకు శిక్షణ పూర్తయింది. వానకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఈసారి ప్రయోగాత్మకంగా ఉమ్మడి జిల్లాలో సాగు ప్రారంభం కానున్నది. ఇప్పటివరకు విదేశాల్లోనే అమలైన ఈ విధానం ఇప్పుడు మన రైతుల చెంతకు చేరింది. సాగుపై ఆసక్తి కలిగిన రైతుల వివరాలను వ్యవసాయశాఖ అధికారులు సేకరిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని రూరల్, ముదిగొండ, చింతకాని, కారేపల్లి, కామేపల్లి, కొణిజర్ల, రఘునాథపాలెం మండలంలోని 1,150 ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు, దుమ్ముగూడెం, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, జూలూరుపాడు, కొత్తగూడెం, గుండాల, పాల్వంచ మండలాల్లోని 590 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా సాగు కానున్నది.
ఎకరానికి 25 వేల మొక్కలు..
పాత పద్ధతిలో ఎకరాలో కేవలం 7 వేల మొక్కలు నాటుతుండగా నూతన పద్ధతిలో ఏకంగా 25 వేల మొక్కలు నాటవచ్చు. ఒక్కో మొక్కకు సుమారు 8- 9 కాయలు కాపు వస్తే దాదాపుగా 15 క్వింటాళ్లు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ కాపు ఉంటే 20 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధించవచ్చు. పాత విధానంలో 120X190 సెంటీమీటర్ల దూరం చొప్పున విత్తనాలు నాటుకోవాల్సి ఉండేది. నూతన పద్ధతిలో కేవలం 80X20 సెంటీమీటర్ల దూరంలోనే విత్తనాలు నాటుకోవచ్చు. పాత పద్ధతిలో కేవలం 3-4 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి రాగా నూతన పద్ధతిలో 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. తద్వారా రైతులకు రెట్టింపు ఆదాయం వస్తుందన్నారు. మొక్క మొక్కకు మధ్య ఒత్తిడికి గురికాకుండా మెసిక్యాట్ క్లోరైడ్ ఒక మిల్లిలీటర్ను లీటర్ నీళ్లతో కలిపి 40-45 రోజులకు ఒకసారి, 75-80 రోజులకు మరోసారి పిచికారీ చేస్తే మొక్క ఎక్కువగా పెరగకుండా ఉంటుంది. దీంతో ఎక్కువ కాయలు ఒకేసారి పగిలి పంట చేతికొచ్చే అవకాశం ఉంటుంది. పంట పూర్తయిన తర్వాత ఇదే భూమిలో రైతులు జొన్న, మొక్కజొన్న సాగు చేసుకోవచ్చు.
సాగుపై అవగాహన..
వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, ఏవోలు, వ్యవసాయశాఖ విస్తరణ అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయిలోకి వెళ్లి సాగు విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. నూతన పద్ధతి గులాబీ పురుగు బెడదను తొలగిస్తుందంటున్నారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే 800 ఎకరాల్లో సాగుకు రైతులు సమ్మతి తెలిపినట్లు తెలుస్తున్నది. కొన్ని క్షేత్రాల్లో విత్తనాలు నాటినట్లు సమాచారం. ఖమ్మం జిల్లాలో 1,050 ఎకరాల్లో సాగుకు నూజివీడు విత్తనాలు, మరో 100 ఎకరాల్లో రాశి విత్తనాలు, పురుగు మందులు రైతులకు అందనున్నాయి. కొత్త పద్ధతిలో విత్తనాలు ఎక్కువగా వాడాల్సిన అవసరం ఉన్నందున, కూలి ఖర్చులు భరించాల్సి ఉన్నందున ప్రభుత్వమే ఎకరానికి రూ.4 వేల చొప్పున రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నది.
పత్తి సాగులో నూతన శకం..
అధిక సాంద్రతలో పత్తి సాగు విధానం నూతన శకం. ఈ పద్ధతిలో రైతులకు బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. రైతులు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంట పండించి అధిక దిగుబడులు సాధించవచ్చు. పంట ఒకేసారి చేతికి వస్తుండడంతో తిరిగి ఇదే భూమిలో మరోపంట సాగు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ విధానంలో గులాబీ పురుగు తెగులు బెడద కూడా ఉండదు. – ఎం.విజయనిర్మల, డీఏవో, ఖమ్మం
గులాబీ పురుగు దరి చేరదు..
అధిక సాంద్రత పత్తి విధానం రైతులకు అధిక లాభాలు ఇస్తుంది. ఈ పద్ధతిలో కేవలం 140 రోజుల్లోనే పంట చేతికొస్తుంది. మొక్కలు ఎక్కువగా పెరగకుండా ‘చమత్కార్’ను రెండుసార్లు పిచికారీ చేస్తే మేలు జరుగుతుంది. కాయలు దృఢమవుతాయి. ఈ ఏడాది ప్రయోగాత్మకంగా సాగు చేపడుతున్నాం. వచ్చే ఏడాది విస్తీర్ణాన్ని మరింత పెంచుతాం.
– లాల్‌చంద్, ఏడీఏ, కొత్తగూడెం