ఖమ్మం, జూన్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘వైఎస్ షర్మిలా.. దమ్ముంటే ఖమ్మంలో పోటీ చేసి గెలువు’ అంటూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సవాల్ విసిరారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పాదయాత్రలో భాగంగా గురువారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన కార్యాక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను విమర్శించారు. ఇందుకు మంత్రి అజయ్ శుక్రవారం స్పందించారు. నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ షర్మిల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేని పార్టీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రజలను తప్పుదోవపట్టించే విధంగా మాట్లాడడం విడ్డురంగా ఉందన్నారు. వైఎస్ షర్మిలకు దుమ్ముంటే కనీసం పాలేరులో పోటీ చేసి గెలవాలని, అక్కడా తమ సత్తా ఏమిటో చూపిస్తామనని సవాల్ విసిరారు.
ఎంతోమంది నాయకులు యాత్రికుల మాదిరగా వస్తూ పోతూ ఉంటారని, అలాంటి వారి మాటలు ప్రజలు నమ్మరని అన్నారు. దారిన వెళ్తుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయని, అలాంటి కుక్కలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఘాటుగా స్పందించారు. ‘పరిటాల రవిని తూటాలతో పేల్చి చంపింది ఎవరు? మొద్దు శ్రీను కాదా? ఆయన్ను కూడా చంపారు కదా? అని ఆరోపించారు. ‘బయ్యారం ఉక్కు గనులు మిగింది ఎవరు’ అని ప్రశ్నించారు. ‘క్యాట్ వాక్ చేస్తూ బిర్యానీలు తింటే సరిపోతుందా?’ అని విమర్శించారు. ఎవరు ఎలాంటి వారో తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. ‘అధికారం కోసం మీ కుటుంబంలో ఏం జరిగిందో.. ఏం జరుగుతుందో.. మీరు ఏం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు’ అని అన్నారు. తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తామంతా నిరంతరం శ్రమిస్తున్నామని అన్నారు.