ఆళ్లపల్లి, జూన్ 18: ఒకప్పుడు నిత్యం అంతరాయాలతో కాలం వెళ్లదీసిన ఆళ్లపల్లి మండల ప్రజలు.. ఇప్పుడు నిరంతర విద్యుత్ సౌకర్యాన్ని పొందుతున్నారు. పైగా లోవోల్టేజీ సమస్యలు సైతం తొలగిపోవడంతో 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతోంది. ఆళ్లపల్లిలో రూ.1.60 కోట్లతో టీఆర్ఎస్ ప్రభుత్వం నూతన సబ్ స్టేషన్‌ను నిర్మించి ఆళ్లపల్లి, మర్కోడు, అనంతోగు పంచాయతీల్లో కరెంటు సమస్యలను తొలగించడంతో గ్రామస్తులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.నిరంతర సరఫరా..
ఒకప్పుడు ఆళ్లపల్లిలో సబ్ స్టేషన్ లేకపోవడంతో ఉమ్మడి గుండాల మండలంలోని మామకన్ను గ్రామంలో ఉండే సబ్‌స్టేషన్ ద్వారానే విద్యుత్ సరఫరా జరిగేది. ఈ లైన్లో ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా దానికి మరమ్మతులు చేసే వరకు ఉమ్మడి గుండాల మండలం మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయేది. అలా ఒకటి రెండు రోజుల నుంచి వారం పది రోజుల దాకా కరెంటు వచ్చేదే కాదు. వర్షాకాలంలో అయితే కరెంటు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడేవారు. పైగా మామకన్ను సబ్‌స్టేషన్‌కు 3000 విద్యుత్ మీటర్లుండేవి. దీంతో విద్యుత్ సమస్యలు అధికంగా ఉండేవి.
కానీ తెలంగాణ ఏర్పడ్డాక ప్రతి మూడు గ్రామాలకు ఒక సబ్‌స్టేషన్ ఉండాలనే ఉద్దేశంతో గుండాల మండలానికి మరో సబ్‌స్టేషన్‌ను మంజూరు చేశారు. మండలాల విభజనలో భాగంగా నూతనంగా ఆళ్లపల్లి మండలం ఏర్పడింది. దీంతో ఈ మండలంలో విద్యుత్ సమస్యను తొలగించడానికి స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకున్నారు. దీంతో ఆళ్లపల్లికి సబ్ స్టేషన్ మంజూరైంది. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చొరవతో నిర్మాణ పనులు చకచకా పూర్తయ్యాయి. అది ప్రారంభం కావడంతో ఆళ్లపల్లి మండలంలో విద్యుత్ సమస్య తొలగిపోయింది.
పెరిగిన వినియోగం..
విద్యుత్ సమస్య పరిష్కారం కావడంతో వినియోగం పెరిగింది. అన్ని గ్రామాలకూ త్రీఫేజ్ కరెంట్ సరఫరా అవుతోంది. ఇటీవలి పల్లెప్రగతిలో విద్యుత్ సమస్యలను గుర్తిస్తున్న ఆ శాఖ అధికారులు వాటిని పరిష్కరిస్తున్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుండడంతో అధికారులు ఆరు వేల కొత్త కనెక్షన్లు ఇచ్చారు. వ్యవసాయ, ఇతర చిన్న పరిశ్రమల కోసం మరో 800 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి.