ఖమ్మం, జూన్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం మస్త్ కొర్రీలు పెట్టింది. టీఆర్ఎస్, రైతులు వివిధ రూపాల్లో నిరసన తెలిపినా.. కేంద్రం పట్టించుకోలేదు. దీంతో కర్షకులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. యాసంగిలో రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసి రైతులకు వెన్నుదన్నుగా నిలిచింది. మోదీ ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించినా.. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదాతలకు ‘మద్దతు’గా నిలిచారు. కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేశారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా 219 కొనుగోలు కేంద్రాల ద్వారా 75 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. అధికారులు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా.. 70 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. 10,974 మంది రైతులు ధాన్యాన్ని విక్రయించగా.. వారి ఖాతాల్లో రూ.145.22 కోట్లు జమ అయ్యాయి.
రైతులు ఆరుగాలం శ్రమించి యాసంగిలో పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించినా రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసింది. కేంద్ర ప్రభుత్వ మొండివైఖరితో రైతులు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ధాన్యం కొనుగోలు నిర్ణయం తీసుకున్నారు. యాసంగిలో రైతులు వరి సాగును తగ్గించడం, ఇతర పంటలపై దృష్టి సారించడంతో ఈసారి వరి విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఏటా 3.20 లక్షల ఎకరాల్లో చేస్తుండగా ఈసారి కేవలం 2 లక్షల ఎకరాలకు మాత్రమే వరి సాగు జరిగింది. ఏప్రిల్ మొదటివారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
రైతుల ఖాతాల్లో రూ.142.22 కోట్లు..
జిల్లావ్యాప్తంగా 219 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 75 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయింది. ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, డీసీఎంఎస్, వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. కేంద్రంలో రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర లభించింది. ఇప్పటివరకు కేంద్రాల్లో 10,974 మంది రైతులు ధాన్యాన్ని విక్రయించారు.
రైతుల ఖాతాల్లో రూ.145.22 కోట్లు జమ చేయాల్సి ఉండగా ఇప్పటికే 80శాతం మంది బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయింది. అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ ప్రత్యేక చొరవ తీసుకుని నగదు జమ చేయిస్తున్నారు. రెండు నెలల పాటు నిరంతరాయంగా కేంద్రాలు ఈ నెల 1 వరకు కొనసాగాయి. లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యానికి అధికారులు 70 వేల మెట్రిక్ టన్నులు పూర్తి చేశారు. రైతులు ఈ సారి సన్నరకం ధాన్యాన్ని ఎక్కువ పండించారు. పండించిన ధాన్యంలో ఎక్కువ భాగాన్ని తిండి గింజల కోసం నిల్వ చేసుకున్నారు. దీంతో ధాన్యం సేకరణ లక్ష్యం కాస్త తగ్గింది.
రైతుల ఖాతాల్లో నగదు జమ..
జిల్లావ్యాప్తంగా 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాం. ఇప్పటికే 80శాతం మంది బ్యాంకు ఖాతాల్లో నగదు చేశాం. మిగిలిన వారి ఖాతాల్లో రెండు మూడు రోజుల్లో నగదు జమ అవుతుంది.
– మధుసూదన్,అడిషనల్ కలెక్టర్, ఖమ్మం