ఖమ్మం, జూన్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కొత్తగూడెం ఎడ్యుకేషన్ : ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత విద్యాసంవత్సరం ప్రారంభమైంది. ‘బడి’ గంట మోగింది. 45 రోజుల సెలవుల తరువాత సోమవారం పాఠశాలలు తెరుచుకున్నాయి. తోరణాలు, బెలూన్లు కట్టి పండుగ వాతావరణంలో పాఠశాలలను ప్రారంభించారు. దీంతో స్కూళ్లలో విద్యార్థుల సందడి మొదలైంది. జిల్లావ్యాప్తంగా మొత్తం 1,464 ప్రభుత్వ, కేజీబీవీ పాఠశాలలు ఉన్నాయి. తొలిరోజు 66,543 మంది విద్యార్థులకు గాను 21,368 మంది హాజరయ్యారు. 32.11శాతం హాజరు నమోదైంది. గుండాల మండల ప్రజాపరిషత్ పాఠశాలలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు అందించి ఆహ్వానించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాఠశాలలను పరిశుభ్రం చేయించడంతోపాటు మౌలిక వసతుల ఏర్పాటుపై దృష్టి సారించారు. బడిబాటలో భాగంగా ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో నూతనంగా 3,726 మంది విద్యార్థులు చేరారు. అంతేకాదు, ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారు బడుల్లో మౌలిక వసతుల కల్పనకు ‘మన ఊరు/ మన బస్తీ – మన బడి’ని ప్రవేశపెట్టారు. దీంతో ఈ ఏడాది విద్యార్థుల అడ్మిషన్లు భారీగా పెరుగుతాయని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.
‘బడి’ గంట మోగింది. వేసవి సెలవుల ముగియడంతో విద్యార్థులు సోమవారం బడిబాట పట్టారు. 45 రోజుల సెలవుల తరువాత సోమవారం స్కూళ్లు తెరుచుకున్నాయి. బడి గంట మోగడంతో పాఠశాలల్లో విద్యార్థుల సందడి మొదలైంది. కరోనా కారణంగా రెండేళ్ల తరువాత తొలిసారిగా ఈ ఏడాది నూతన విద్యాసంవత్సరం ప్రారంభమైంది. పాఠశాలలకు విద్యార్థుల హాజరు శాతంపై తొలిరోజు నుంచే దృష్టి ఉపాధ్యాయులు సారించింది. ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం, తీర్థాల ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. గైర్హాజరైన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి కారణాలు తెలుసుకున్నారు.
తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు పరిశుభ్రం చేయించడంతోపాటు మౌలిక వసతుల ఏర్పాటుపై దృష్టి సారించారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 1,619 పాఠశాలలు తెరుచుకున్నాయి. విద్యార్థుల హాజరు సంఖ్య భారీగానే నమోదైంది. ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారు బడుల్లో మౌలిక వసతుల కల్పనకు ‘మన ఊరు/ మన బస్తీ – మన బడి’ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా అందుకు తగిన వనరులను సమకూర్చుతున్నారు.
ఇటీవల నూతన జిల్లాల ప్రకారం బదిలీలు నిర్వహించి విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడంతో అన్ని పాఠశాలలకూ ఉపాధ్యాయులు సంపూర్ణంగా హాజరయ్యారు. పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో ప్రధానోపాధ్యాయులు మొదలుకొని ఉపాధ్యాయుల వరకు స్కూళ్లకు తోరణాలు కట్టి పండుగ వాతావరణాన్ని తలపింపజేశారు. పాఠశాల ద్వారం నుంచి ప్రతి తరగతి గదికి మామిడి తోరణాలు కట్టారు. తీర్థాల పాఠశాలలో ప్రార్థనా సమయం ముగుస్తున్న సమయంలో కలెక్టర్ వీపీ గౌతమ్ అక్కడికి చేరుకున్నారు. వెంటనే అక్కడ జరుగుతున్న తరగతులను పరీశీలించారు.
భద్రాద్రిలో 32 శాతం..
గుండాలలో విద్యార్థులను ఆహ్వానించిన ప్రభుత్వ విప్ రేగా పాఠశాలలు ప్రారంభమైన తొలిరోజు సోమవారం నాడు భదాద్రి జిల్లాలో మొత్తం 66,543 మంది విద్యార్థులకు గాను 21,368 మంది హాజరయ్యారు. 32.11 శాతం హాజరు నమోదైంది. పలుచోట్ల విద్యార్థులను ప్రజాప్రతినిధులు, నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి విద్యార్థులను పాఠశాలలకు ఆహ్వానించారు. బడిబాటలో భాగంగా ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా నూతనంగా 3,726 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. గుండాల మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు అందించి ఆహ్వానించారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని కూలీలైన్ పాఠశాలలో కౌన్సిలర్ రుక్మాంగదర్ బండారి, హెచ్ఎం రమాదేవిలు విద్యార్థులకు నూతన పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసి ఆహ్వానించారు. దమ్మపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, పాఠశాలల ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులను సాదరంగా ఆహ్వానించారు.