భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : ఇల్లెందు, కొత్తగూడెం మున్సి పాల్టీలు స్వచ్ఛతలో పోటీ పడుతున్నాయి. పారిశుధ్యంతోపాటు మౌలిక వసతుల కల్పనలో ఆదర్శంగా నిలుస్తున్నా యి. మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు రోజూ పట్టణంలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. తక్షణం వాటిని పరిష్కరించి ప్రజల మన్ననలు పొం దుతున్నారు. మణుగూరు, పాల్వంచ మున్సిపాలిటీల్లో పాలక మండళ్లు లేకపోయినా యంత్రాంగం అభివృద్ధికి బాటలు వేస్తున్నాయి. అంతేకాదు, పట్టణ ప్రగతిపై ప్రత్యేక దృష్టిసారించిన కలెక్టర్ అనుదీప్ ఇల్లెందు, కొత్తగూడెం మున్సిపాలిటీలకు పోటీ పెట్టారు. బెస్ట్ ఐదు వార్డులకు రూ.15 లక్షల చొప్పున నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిధులు ఇస్తామని పేర్కొన్నారు. దీంతో ఆ రెండు పట్టణాలు ప్రగతిలో దూసుకెళ్లేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి.
స్వచ్ఛత అంటే ఇలా ఉండాలని ఆచరణలో చూపిస్తున్నారు ఇల్లెందు, కొత్తగూడెం మున్సిపల్ యంత్రాంగం, పాలకవర్గాలు. అభివృద్ధిలో పోటీ పడుతూ మున్సిపాలిటీల ఖ్యాతిని రాష్ట్రస్థాయిలో ఇనుమడింప జేస్తున్నాయి. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తూ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. పారిశుధ్యం, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించి స్వచ్ఛ పట్టణాలుగా తీర్చిదిద్దుతున్నాయి. మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు రోజూ పట్టణంలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. తక్షణం వాటిని పరిష్కరించి ప్రజల మన్ననలు పొందుతున్నారు.
మణుగూరు, పాల్వంచ మున్సిపాలిటీల్లో పాలక మండళ్లు లేకపోయినా యంత్రాంగం అభివృద్ధికి బాటలు వేస్తున్నది. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మణుగూరు పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. అధికారులు, కౌన్సిలర్లతో పాటు ఇతర ప్రజాప్రతినిధుల నిత్య పర్యవేక్షణతో పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ పక్కాగా సాగుతున్నది. పారిశుధ్య కార్మికులు ఎప్పటికప్పుడు వీధుల్లో నిలిచిన చెత్తను డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. పట్టణ సిబ్బంది ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటుతున్నారు. ప్రతిరోజూ ట్యాంకర్లతో మొక్కలకు నీళ్లు పోస్తున్నారు.
బెస్ట్ వార్డులకు రివార్డు..
పట్టణ ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్ అనుదీప్ ఇల్లెందు, కొత్తగూడెం మున్సిపాలిటీలకు పోటీ పెట్టారు. బెస్ట్ ఐదు వార్డులకు రూ.15 లక్షల చొప్పున నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిధులు విడుదల చేస్తామన్నారు. ఏయే రంగాల్లో ప్రగతి సాధించాలనే విషయంపై ఇప్పటికే మున్సిపల్ కమిషన్లరకు స్పష్టత వచ్చింది.
కొత్తగూడెం అభివృద్ధికి రూ.9 కోట్లు..
కొత్తగూడెం అభివృద్ధికి ప్రభుత్వం రూ.9 కోట్ల నిధులు విడుదల చేయగా పాలకవర్గం వాటిని సద్వినియోగం చేసింది. ప్రజా సమస్యలను పరిష్కరించింది. రామవరం ప్రాంతంలోని ముంపునకు గురయ్యే ప్రాంతంలో రూ.50 లక్షల నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించారు. పట్టణ పరిధిలోని 36 వార్డుల్లో చెత్త తరలింపునకు 36 వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. పారిశుధ్య సిబ్బంది రోజూ పట్టణంలో సేకరించిన చెత్తను డంపింగ్యార్డులకు తరలిస్తున్నారు. కంపోస్ట్ ఎరువు తయారు చేస్తున్నారు. రూ.కోటి వ్యయంతో తడి చెత్త పొడి వ్యర్థాలను ఎరువుగా మార్చే కర్మాగారాన్ని నిర్మించారు. ఏటా 5 టన్నుల తయారు చేసి తద్వారా రూ.5 లక్షల ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. మరో రూ.కోటి నిధులతో పట్టణంలోని 11 చోట్ల టాయిలెట్లు, మరుగుదొడ్లు నిర్మించారు. డివైడర్లలో పూల మొక్కలు నాటారు. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు.
ఇల్లెందు మున్సిపాలిటీలో..
పబ్లిక్ టాయ్లెట్స్ నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసి వాటి వినియోగంలోకి తీసుకువచ్చిన ఇల్లెందు మున్సిపాలిటీ ఇటీవల ‘బెస్ట్ మున్సిపాలిటీ’ అవార్డును దక్కించుకున్నది. ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ, మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లు పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి 24 వార్డుల్లో విద్యుత్ సమస్యలను పరిష్కరించారు. రూ.30 లక్షలతో బృహత్ ప్రకృతి వనం, రూ.10 లక్షలతో డ్రైనేజీలు, రూ.30 లక్షలతో అవెన్యూ ప్లాంటేషన్, రూ.5 లక్షలతో నర్సరీలు ఏర్పాటు చేశారు. షాపింగ్ కాంప్లెక్స్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణాలను పూర్తి చేశారు. రూ.90.20 లక్షలతో స్వచ్ఛ ఆటోలు కొనుగోలు చేశారు. ఏడు ప్రాంతాల్లో టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేశారు.
కలెక్టర్ చొరవతోనే..
పట్టణాభివృద్ధిపై కలెక్టర్ అనుదీప్ ప్రత్యేక దృష్టి సారించారు. నిత్యం పట్టణంలో పర్యటించి ప్రజాసమస్యలను పరిష్కరిస్తున్నారు. ఇటీవల రామవరంలో ముంపు సమస్యను పరిష్కరించారు. తడి పొడి చెత్త వేరు చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేయించారు. ప్రభుత్వ లక్ష్యాలను అధిగమించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాం.
– నవీన్, మున్సిపల్ కమిషనర్, కొత్తగూడెం
బెస్ట్ అవార్డు సాధించాం..
ఇల్లెందు పట్టణంలో టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేసి బెస్ట్ మున్సిపాలిటీ అవార్డును సొంతం చేసుకున్నాం. ప్రజాప్రతినిధులు, అధికారుల సహాయ సహకారాలతో పట్టణ ప్రగతిని విజయవంతం చేస్తున్నాం. ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. ప్రజల మన్ననలు పొందుతున్నాం.
– అంకుషావలీ, కమిషనర్, ఇల్లెందు