గుండాల, జూన్ 13: తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. సోమవారం గుండాల మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గుండాలలోని ప్రభుత్వ పాఠశాలలో రూ.27 లక్షలతో చేపట్టనున్న ‘మన ఊరు – మన బడి’ పనులను ప్రారంభించారు. అనంతరం మండల వ్యవసాయ కార్యాలయ ఆవరణలో దళితబంధు లబ్ధిదారులకు ట్రాలీ వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల ఆర్థిక ఎదుగుదలకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు దళితులంతా రుణపడి ఉంటారని అన్నారు.
అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.50 లక్షలతో నిర్మించనున్న వైద్యుల స్టాఫ్ క్వార్టర్స్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కాచనపల్లి గ్రామానికి చెందిన మంతెన సురేశ్‌కు ఇటీవల ఓ ప్రమాదంలో చేయి విరిగిపోవడంతో అతడిని పరామర్శించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు ద్వారా రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. మాజీ మంత్రి జలగం ప్రసాద్‌రావు, ఎంపీపీ ముక్తి సత్యం, జడ్పీటీసీ వాగబోయిన రామక్క, ఎంపీటీసీ ఎస్కే సందాని, సర్పంచ్ కోరం సీతారాములు, ఎంఈవో పెండెకట్ల కృష్ణయ్య, టీఆర్ఎస్ నాయకులు తెల్లం భాస్కర్, మోకాళ్ల వీరస్వామి, సయ్యద్ అజ్జు, పొంబోయిన సుధాకర్తదితరులు పాల్గొన్నారు. సీఐ కరుణాకర్ బందోబస్తు నిర్వహించారు.