ఖమ్మం, జూన్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి, యువనేత కల్వకుంట్ల తారక రామారావు శనివారం నగరంలో పర్యటించనున్నారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.అందుకు యంత్రాంగం సకల ఏర్పాట్లు పూర్తి చేసింది. మంత్రులు నగరంతో పాటు ఖమ్మం నియోజకవర్గవ్యాప్తంగా నిర్వహించనున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. జిల్లాసమగ్రాభివృద్ధిపై దిశానిర్దేశం చేయనున్నారు. నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పల్లె, పట్టణ ప్రగతి పనులపై ప్రసంగించనున్నారు. సభకు భారీగా ప్రజలు తరలివస్తారని యంత్రాంగం అంచనా వేసి అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే టీఆర్ఎస్ శ్రేణులు జన సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించి సభను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేశాయి. మొత్తానికి మంత్రి కేటీఆర్ పర్యటన పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపుతుందని, రానున్న ఎన్నికలకు సమాయత్తం కావడానికి ఈ పర్యటన ఉపకరిస్తుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
పర్యటన ఇలా..
మంత్రి కేటీఆర్ ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి హైలికాఫ్టర్‌లో బయల్దేరుతారు. 9 గంటలకు మమత జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లో దిగుతారు. 9.15 గంటలకు లకారం చెరువుపై రూ.8 కోట్ల వ్యయంతో నిర్మించిన కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్, మ్యూజికల్ ఫౌంటేన్, ఎల్ఈడీ లైటింగ్, 9.45గంటలకు రఘునాథపాలెంలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన సుడా పార్క్, బృహత్ పల్లెప్రకృతి వనం, 10.15 గంటలకు టేకులపల్లిలో 240 డబుల్ బెడ్రూం ఇండ్లు, తెలంగాణ క్రీడా ప్రాంగణం, పట్టణ ప్రకృతి వనాన్ని ప్రారంభిస్తారు. 10.45 గంటలకు సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ప్రసంగిస్తారు. మధ్యాహ్నం పాత మున్సిపల్ కార్యాలయంలో సిటి లైబ్రరీ, ఐటీ హబ్ సర్కిల్ నుంచి జడ్పీ సెంటర్ వరకు నిర్మించిన ఫుట్‌పాత్, దానవాయిగూడెంలో ఎఫ్ఎస్టీపీ, ప్రకాశ్‌నగర్‌లోని వైకుంఠధామాన్ని ప్రారంభిస్తారు. 2 గంటలకు శ్రీనివాస్‌నగర్‌లో మానవ వ్యర్థ పదార్థాలను శుద్ధి చేసే కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ధంసలాపురం వద్ద ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన నర్సరీని ప్రారంభిస్తారు.

పర్యటనకు పటిష్ట బందోబస్తు: సీపీ
మంత్రి కేటీఆర్ పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. నగరంలోని భక్త రామదాస్ కళాక్షేత్రంలో శుక్రవారం మంత్రి పర్యటనపై పోలీస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరికి అప్పగించిన బాధ్యతలను వారు సమర్థంగా నిర్వహించాలని సూచించారు. విధి నిర్వహణలో ప్రతిఒక్కరికీ స్పష్టత ఉండాలన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల రోజువారీ పనులకు అంతరాయం కలగొద్దన్నారు. అత్యవసర మెడికల్ సర్వీసులు, అంబులెన్స్ సర్వీసులకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దన్నారు. సమావేశంలో అడిషనల్ డీసీపీలు డాక్టర్ శబరీశ్, కుమారస్వామి, ఏసీపీలు సాధన రష్మి పెరుమాళ్, రామోజీ రమేశ్, ఆంజనేయులు, బస్వారెడ్డి, వెంకటేశ్, ప్రన్నకుమార్, వెంకటస్వామి, రవి, విజయ్‌బాబు పాల్గొన్నారు.