ఖమ్మం, జూన్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం జిల్లా బెస్ట్ ట్యాక్స్ పేయర్‌గా శ్రీ బాలాజీ ఎస్టేట్స్ మేనేజింగ్ డైరెక్టర్ వత్సవాయి రవికి అరుదైన గుర్తింపు లభించింది. భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా కేంద్రం ప్రభుత్వం మూడేళ్లుగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో వేడుకలను నిర్వహిస్తోంది. ఈ ఏడాది హైదరాబాద్‌లో నిర్వహించే ఈ వేడుకల్లో భాగంగా ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపార దిగ్గజ సంస్థ ‘శ్రీ బాలాజీ ఎస్టేట్స్’కు అరుదైన గౌరవం దక్కింది. శ్రీబాలాజీ ఎస్టేట్స్ వేదికగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వత్సవాయి రవి నవభారత నిర్మాణం కోసం చేస్తున్న కృషికి ఈ అవార్డు దక్కింది. తాను స్థాపించిన సంస్థలో ప్లాట్లు కొనుగోలు చేసిన వినియోగదారులకు కచ్చితమైన నమ్మకాన్ని కలిగించడంతోపాటు పెట్టుబడి నుంచి వచ్చిన ప్రతి పైసాకూ ఇన్‌కం ట్యాక్స్ చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ సంస్థ ఖమ్మానికి చెందిన వత్సవాయి రవిని 2021-22 సంవత్సరానికి బెస్ట్ ట్యాక్స్ పేయర్‌గా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో ప్రకటించింది. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన వేడుకల్లో వత్సవాయి రవికి ఇన్‌కం ట్యాక్స్ జాయింట్ కమిషనర్ తేజావత్ వెంకన్న ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఖమ్మం జిల్లా నుంచి శ్రీబాలాజీ ఎస్టేట్స్‌కు అవార్డు దక్కడం పట్ల పలు వ్యాపార సంస్థల ప్రతినిధులు వత్సవాయి రవికి అభినందనలు తెలియజేశారు.