ఖమ్మం రూరల్, జూన్ 8 : లే అవుట్లలో ఓపెన్ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం రూరల్ మండలంలో విస్తృతంగా పర్యటించి లే అవుట్లు, కెనాల్ బండ్లు, పారిశుధ్య పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలెపల్లి గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణ స్థలాన్ని పరిశీలించి మాట్లాడుతూ స్థానికంగా యువత ఇష్టపడే క్రీడలకు సంబంధించిన కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. క్రీడా ప్రాంగణాల చుట్టూ ఫెన్సింగ్ వెంబడి మొక్కలు నాటాలన్నారు. గ్రామంలో ఎన్నెస్పీ స్థలాన్ని పరిశీలించారు.
కెనల్ వెంబడి ఇరువైపులా పిచ్చిమొక్కలు తొలగించి, శుభ్రం చేసి మల్టీలేయర్‌లో గుంతలు తవ్వించి మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. గ్రామంలో నిర్మాణదశలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించారు. పెయింటింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని, పరిసరాలను శుభ్రం చేయాలని సూచించారు. ఇంటి ఆవరణలోని ఖాళీస్థలాల్లో మొక్కలు నాటాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ పల్లెగూడెం, గోళ్లపాడు రోడ్ వద్ద కెనాల్‌ను పరిశీలించారు. కెనాల్ వెంబడి మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
మండల పరిషత్ పాఠశాలను తనిఖీ చేసి బడిబాట అమలు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంసవత్సరం నుంచి ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన ఉంటుందన్న విషయంపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం పల్లెగూడెం ఎన్నెస్సీ కెనాల్, గుర్రాలపాడు వద్ద వెంచర్‌ను పరిశీలించారు. గ్రీన్‌బెల్టు కింద వదిలిన స్థలాల్లో క్రీడాప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనాలు నిర్మించాలని సూచించారు. వెంకటగిరిలోని తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు.
చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటాలని అధికారులు లక్ష్యం మేరకు వ్యక్తిగత శ్రద్ధతో పనులు పూర్తి చేయాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో మండల ప్రత్యేక అధికారి జ్యోతి, టీఎస్ ఈడబ్ల్యూడీసీ ఈఈ జే.నగేష్, మండల ఎంపీడీవో అశోక్‌కుమార్, తహసీల్దార్ సుమ, విద్యుత్‌శాఖ డీఈ రామారావు, డీఎల్పీవో పుల్లారావు, మిషన్ భగీరథ ఏఈ వెంకటేశ్వర్లు, ఎంపీఈవో శ్రీనివాసరావు, సర్పంచులు నాగరత్తమ్మ, ముత్తయ్య, ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.