కొణిజర్ల, జూన్ 8: ‘యువత పెడదోవను వీడి సేవలందిస్తూ సన్మార్గంలో నడవాలి’ అన్నారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం. ఈ పిలుపును ఆదర్శంగా తీసుకున్న ఆ యువకులు సేవా మార్గాన్ని ఎంచుకుని సమాజ సేవకు నడుం బిగించారు. తమ ఊరికి ఉపకారం చేయడంలో ముందంజలో ఉన్నారు. పోటీ పరీక్షల సమయంలోనూ ఉద్యోగార్థులకు చేదోడువాదోడుగా ఉంటున్నారు. శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ హరితహారం ప్రాధాన్యాన్ని వివరిస్తున్నారు. ఏటా పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటడం, సామాజిక రుగ్మతలపై అవగాహన కల్పించడం, పోటీ పరీక్షల్లో విద్యార్థులను ప్రోత్సహించడం, ప్రతిభ కనబరిచిన వారికి నగదు ప్రోత్సాహకాలు అందించడం, పర్యావరణ హితం కోసం విస్తృత ప్రచారం చేయడం, వినాయక చవితి లాంటి సందర్భాల్లో మట్టి ప్రతిమలు పంపిణీ చేయడం, కొవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులకు సాయం అందించడం వంటి సేవా కార్యక్రమాలను విరివిగా నిర్వహిస్తున్నారు.
ఉన్న ఊరును ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడు గ్రామానికి చెందిన పలువురు యువకులు 2011లో ఫ్రెండ్స్‌యూత్ పేరుతో యువజన సంఘాన్ని స్థాపించారు. తొలుత అయిదారుగురు సభ్యులతో ప్రారంభమైన ఈ సంఘం.. సంఘ అధ్యక్షుడు తాటిపల్లి సుధీర్ ఆధ్వర్యంలో నేడు సుమారు 40 మందికి పైగా సభ్యులు ఉన్నారు. వీరంతా సమష్టిగా సొంత గ్రామంలో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మద్యపానం, మూఢనమ్మకాలు వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి, ఇతర అత్యవసర చికిత్స సమయాల్లో అవసరం ఉన్న వారికి రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
గౌరవ అధ్యక్షుడిగా రాములునాయక్
2011 నుంచి ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు సామాజిక కార్యక్రమాలకు ఆకర్శితుడైన వైరా ఎమ్మెల్యే రాములునాయక్ ఫ్రెండ్స్‌యూత్ గౌరవ సలహాదారుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యే మనువడు, ఐఆర్ఎస్ అధికారి జీవన్‌లాల్ కుమారుడు హిమానిష్ ఫ్రెండ్స్ యూత్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నారు. పలు సేవా కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొంటున్నారు.
చేపట్టిన కార్యక్రమాలు..
గ్రామస్తుల సహకారంతోనే సేవా కార్యక్రమాలు..
యువకులతోపాటు గ్రామస్తులంతా సమష్టిగా సహకరించడంతో ఫ్రెండ్స్యూత్ను మున్ముందుకు తీసుకెళ్తున్నాం. మాతోపాటుగా పలువురి దాతల సహకారంతో ఎంతోమందికి సేవలందిస్తున్నాం. సామాజిక రుగ్మతలపై అవగాహన సదస్సులు, సేవా కార్యక్రమాలను మున్ముందు మరింతగా
విస్తరిస్తాం.
-తాటిపల్లి సుదీర్, ఫ్రెండ్స్‌యూత్ అధ్యక్షుడు
సమష్టిగా సామాజిక కార్యక్రమాలు..
గ్రామంలోని యువతీ, యువకులు, ఇతర ప్రజాప్రతినిధులు, దాతల సహకారంతో ఫ్రెండ్స్ యూత్ ముందుకు సాగుతోంది. భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు చేపడుతాం. హరితహారం, అక్షరాస్యతా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాల వంటివి మరెన్నో నిర్వహిస్తాం.
-షేక్ రహీం, ఫ్రెండ్స్‌యూత్ ట్రెజరర్