మామిళ్లగూడెం, జూన్ 8: ఖమ్మం పరిపాలనా అడిషనల్ డీసీపీగా డాక్టర్ శబరీశ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న ఆయన పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించి బాధ్యతలు స్వీకరించారు. 2017 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన శబరీశ్ 2019లో మణుగూరు ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించి 2022 వరకు విధులు నిర్వహించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఇప్పటి వరకు ఖమ్మంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్)గా పనిచేస్తున్న గౌస్ అలమ్‌ను ములుగు, భూపాలపల్లి జిల్లా ఓఎస్డీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మణుగూరు ఏఎస్పీగా పని చేస్తున్న శబరీశ్ బదిలీపై ఖమ్మం వచ్చారు.
కమిషనరేట్‌లో పర్యటించిన కలెక్టర్
సాధారణ పర్యాటనలో భాగంగా బుధవారం కలెక్టర్ వీపీ గౌతమ్ నగరంలోని ప్రకాష్‌నగర్ ప్రాంతంలో ఉన్న పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్‌తో కలిసి కార్యాలయ ఆవరణలోని కమాండ్ కంట్రోల్ రూమ్, సీసీటీవీ మానిటర్ రూమ్‌ను సందర్శించారు. కమిషనరేట్ మైదాన ప్రాంతంలో నాటిన మొకలు, నూతనంగా ఏర్పాటు చేస్తున్న వాకింగ్ ట్రాక్, షటిల్, వాలీబాల్ కోర్టులను పరిశీలించారు.