ఖమ్మం కల్చరల్, జూన్ 8: ఆకర్షణీయమైన భారీ సెట్టింగ్‌తో గల డిస్నీలాండ్ ముఖద్వారం. లోపలికి వెళితే ఎన్నో విన్యాసాలు, వినోదాల హరివిల్లులు ఊగిసలాడుతాయి.. మండు వేసవిలో చల్లటి ఆనందాల విందు డిస్నీలాండ్. సందర్శకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది ఈ ఎగ్జిబిషన్. నగరంలోని పెవిలియన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్తంభాద్రి ట్రేడ్ ఫెయిర్ డిస్నీలాండ్ ఎగ్జిబిషన్.. సందర్శకులను ఆకట్టుకుంటుంది. విద్యుత్ దీప అలంకరణలో ప్రతి రోజూ సాయంత్రం ఎన్నో రైడింగ్ అంశాలు, వినోదాత్మక అంశాలతో ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తున్నాయి.

ఆకాశంలో తలకిందులయ్యేటట్టు చేసే ఎత్తయిన జాయింట్ వీల్, గిరగిరా తిప్పే కోలంబస్, సీటులో కూర్చొంటే చాలు చకచకా తిప్పే బ్రేక్ డ్యాన్స్, వేగంగా దూసుకెళ్లే డ్రాగన్ ట్రైన్, కింద పడతామేమో అనే భ్రమ కలిగించే క్రాస్ వీల్ వంటి ఎన్నో ఎమ్యూజ్మెంట్ అంశాలు సందర్శకులను ఆనంద లోకాల్లోకి తీసుకెళుతున్నాయి. వీటితోపాటు నోరూరించే వంటకాలు పసందు చేస్తున్నాయి. చిన్నా పెద్దా అందరూ వీటిని ఎంజాయ్ చేస్తున్నారు. క్యాటర్ పిల్లర్‌లో చిన్నారులు, యువత కేరింతలతో ఆనందిస్తున్నారు. కళంకారి, చేనేత వస్ర్తాలు, వినియోగదారులకు కావాల్సిన అన్ని రకాల వస్తువుల స్టాల్స్ కిటకిటలాడుతున్నాయి. కలెక్టర్ వీపీ గౌతమ్ సైతం ఇటీవల తన కుటుంబ సభ్యులతో సందర్శించి ఎంజాయ్ చేశారు. ఈ ఎగ్జిబిషన్ ఈ నెల ఆఖరు వరకు కొనసాగుతుందని నిర్వాహకులు అమర్లపూడి బాలశౌరి, వాసు, అప్పిరెడ్డి, అచ్చయ్య తెలిపారు.