సత్తుపల్లి, జూన్ 8 : పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల ఆవరణల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తామని మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్ అన్నారు. పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని ఆయన ఏసీపీ వెంకటేశ్‌తో కలిసి బుధవారం ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం ప్రతి పల్లె, వార్డుల్లో విద్యార్థులు, యువకులు, క్రీడాకారులు క్రీడలపై ఆసక్తి చూపేలా క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నదన్నారు. అనంతరం ఏసీపీ వెంకటేశ్, సీఐ కరుణాకర్, కమిషనర్ సుజాత వాలీబాల్ ఆడారు.పోలీసు గృహసముదాయాల్లో పిచ్చిమొక్కలను పోలీసు, మున్సిపల్, రవాణాశాఖ అధికారులు శుభ్రం చేశారు. కార్యక్రమంలో ఎంవీఐ వెంకటపుల్లయ్య, ఎస్సై షాకీర్, కౌన్సిలర్ చాంద్‌పాషా పాల్గొన్నారు.
ఎన్టీఆర్ నగర్లో బడిబాట ర్యాలీ : ఎన్టీఆర్నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం సరోజిని ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు బుధవారం బడిబాట ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం అందించే వివిధ రకాల పథకాలు, సౌకర్యాల గురించి కరపత్రాలను పంచుతూ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు, కమిటీ సభ్యులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో విద్యాకమిటీ చైర్మన్ జాన్‌బీ, కౌన్సిలర్లు ఎస్కె.చాంద్‌పాషా, తడికమళ్ల ప్రకాశ్‌రావు, నడ్డి ఆనందరావు, ఉపాధ్యాయులు సత్యనారాయణరెడ్డి, పద్మావతి, రవికుమార్ రెడ్డి, రాంబాబు, అలీ పాల్గొన్నారు.
క్రీడా ప్రాంగణానికి ఏర్పాట్లు
వేంసూరు, జూన్ 8 : మండలంలోని పలు గ్రామాల్లో ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, ఎంపీడీవో వీరేశంతో కలిసి బుధవారం పర్యటించి క్రీడా ప్రాంగణాలకు అవసరమైన స్థలాలను పరిశీలించారు. బుధవారం చిన్నమల్లెల గ్రామపంచాయతీల్లో క్రీడా ప్రాంగణానికి కావాల్సిన స్థలాన్ని పరిశీలించారు. వారి వెంట చిన్నమల్లెల సర్పంచ్ కుక్కపల్లి సుధాకర్, కార్యదర్శి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కల్లూరు రూరల్, జూన్ 8 : చెన్నూరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సర్పంచ్ పాలెపు లక్ష్మీకాంతమ్మ, సొసైటీ అధ్యక్షుడు పాలెపు రామారావు ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమి ని బుధవారం పరిశీలించారు. రెవెన్యూ సహకారంతో 20 కుంటల భూమిని గ్రామీణ క్రీడాప్రాంగణం కోసం కేటాయించి పనులను ప్రారంభించాలని కార్యదర్శికి సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ బాబ్జీప్రసాద్, ఆర్ఐ స్టాలిన్, కార్యదర్శి నాగశేషిరెడ్డి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
తల్లాడ, జూన్ 8 : నూతనకల్‌లో మన ఊరు- మనబడి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు గ్రామంలోని విద్యార్థులను తల్లిదండ్రులు కలుసుకొని అవగాహన కల్పించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పిల్లలకు అందజేస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ తూము శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాయుడు శ్రీనివాసరావు, ఎంఈవో దామోదరప్రసాద్, ఎంపీటీసీ రుద్రాక్ష బ్రహ్మం, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.