మామిళ్లగూడెం, జూన్ 8: లే ఔట్ల ఆమోదపు అనుమతులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. జిల్లా స్థాయి లే ఔట్ అప్రూవల్ కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఖమ్మం నగర పాలక సంస్థతోపాటు జిల్లాలోని మున్సిపాలిటీల్లో లే ఔట్ల ఆమోదం కోసం అందిన దరఖాస్తులను ఈ సమావేశంలో పరిశీలించారు. నిబంధనల మేరకు సమర్పించిన మూడు దరఖాస్తులకు కమిటీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో లే ఔట్ల ఆమోదం కోసం రెవెన్యూ, విద్యుత్, నీటిపారుదల, రోడ్లు, భవనాలు, టౌన్ ప్లానింగ్ తదితర శాఖల అనుమతుల కోసం అందిన దరఖాస్తులను పరిశీలించాలన్నారు. క్షేత్రస్థాయిలో అన్ని అర్హతలూ ఉన్న వాటికి 21 రోజుల్లోపు అనుమతులను జారీ చేయాలని ఆదేశించారు. లే ఔట్ల డెవలపర్లు కూడా నిబంధనల మేరకు చట్టబద్ధంగా సమగ్ర ప్రణాళి ప్రకారం ల్యాండ్ డెవలప్మెంట్ పనులు చేపట్టాలని సూచించారు. అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, మధుసూదన్, కేఎంసీ అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, ఆర్డీవో రవీంద్రనాథ్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సురేందర్, ల్యాండ్ సర్వే ఏడీ రాము, పీఆర్ ఈఈ శ్రీనివాస్, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, ఆర్అండ్బీ ఈఈ శ్యాంప్రసాద్, అర్బన్ తహసీల్దార్ శైలజ తదితరులు పాల్గొన్నారు.