ఖమ్మం, జూన్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈ నెల 11వ తేదీన ఖమ్మం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్‌కుమార్ ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అలాగే ఖమ్మం కార్పొరేషన్ నూతన భవనం, లకారం ట్యాంక్‌బండ్‌పై సస్పెన్షన్ బ్రిడ్జి, దానవాయిగూడెంలో ఏర్పాటు చేయనున్న ఎస్టీపీతోపాటు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.
నగరంలోని 16వ డివిజన్ పరిధిలో నర్సరీ, రఘునాథపాలెంలోని బృహత్ పల్లె ప్రకృతివనం, ప్రకాష్‌నగర్‌లో వైకుంఠధామం, టేకులపల్లిలోని డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయాలను కేటీఆర్ పరిశీలించడంతోపాటు టేకులపల్లి డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద నూతన కీడా ప్రాంగణం, ప్రకృతి వనాన్ని ప్రారంభించనున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన దాదాపు ఖరారు కావడంతో జిల్లా అధికార యంత్రాంగం, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పర్యటన ఏర్పాట్లపై దృష్టి సారించారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో 11వ తేదీ ఉదయం 9:30గంటలకు సర్దార్ పటేల్ స్టేడియంలో టీఆర్ఎస్ నేతృత్వంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సభలో మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్‌కుమార్, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
నగరంలోని పటేల్ స్టేడియంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లను బుధవారం నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, ఆర్జేసీ కృష్ణ, మంత్రి పువ్వాడ వ్యక్తిగత సహాయకుడు రవికిరణ్ తదితరులు పరిశీలించారు. బహిరంగ సభ కోసం పెద్దఎత్తున జనసమీకరణ చేసేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాలు సమావేశమై జనసమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన కోసం ఖమ్మం నగరాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఈ మేరకు కార్పొరేషన్ అధికారులు నగరంలోని పలు ప్రాంతాల్లో స్వాగత ఏర్పాట్లు చేయనున్నారు. మంత్రులు కేటీఆర్, అజయ్‌కుమార్ పట్టణ, పల్లెప్రగతి కార్యక్రమాల్లో నేరుగా పాల్గొననున్నారు.