ఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 8: జ్ఞానమంతా పంచభూతాల దగ్గరే ఉందని ప్రముఖ ప్రజా వాగ్గేయకారుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పేర్కొన్నారు. ప్రకృతికి దగ్గరగా ఉన్న వారు, ప్రజల జీవితాలతో మమేకమైన వారే అద్భుతమైన రచయితలుగా గొప్ప పుస్తకాలు రాస్తారని అన్నారు. నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలోని రావెళ్ల వెంకటరామారావు ప్రాంగణం, జాతశ్రీ వైదికపై ఎనిమిది రోజులుగా కొనసాగిన ఖమ్మం పుస్తక మహోత్సవం బుధవారం ముగిసింది.
ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. మానవీయ సమాజం నిర్మించాలంటే పుస్తకాలను చదవాల్సిందేనని అన్నారు. దార్శనికులైన సమాజ దిశానిర్దేశకులందరూ గొప్ప పుస్తక ప్రియులేనని గుర్తుచేశారు. కేశవరెడ్డి రచించిన అద్భుతమైన ఎనిమిది నవలలు సామాన్య మానవులను కథానాయకులుగా చిత్రీకరించాయని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి గొప్ప చదువరి కాబట్టే జ్ఞాన తెలంగాణ నిర్మాణం కోసం ఇలాంటి పుస్తక ప్రదర్శనలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు.
వేమన, వీరబ్రహ్మం మత సామరస్యం కోసం పోరాడారని గుర్తుచేశారు. కాగా, తన అనర్గళమైన కంఠంతో గేయాలను ఆలపించి ఆహుతులను అలరించారు గోరటి వెంకన్న. సభకు అధ్యక్షత వహించిన పుస్తక ప్రదర్శన నిర్వాహకుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ.. భావజాల ఆయుధాలు పుస్తకాలేనని, వాటిని చదివితే అజ్ఞానం నుంచి బయటపడవచ్చునని అన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా సీఎం కేసీఆర్ నిలిచారని, ఈ తరుణంలో తెలంగాణ సమాజం ఆయనకు అండగా నిలవాలని అన్నారు. లౌకికవాద శక్తులన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న మతమాఢ్యాలకు వ్యతిరేకంగా సెక్యులర్ భావాలతో సమాజాన్ని నడిపించేందుకు పుస్తకాలే దిక్యూచిలవుతాయని అన్నారు.
ఖమ్మం పుస్తక ప్రదర్శనకు కర్త, కర్మ, క్రియగా కలెక్టర్ వీపీ గౌతమ్ వ్యవహరించి తమ దార్శనికతను చాటుకున్నారని అన్నారు. ఈ బుక్ ఫెయిర్‌కు పాఠకులు, పుస్తక ప్రియులు పెద్ద ఎత్తున్న రావడం పుస్తక విప్లవమేనన్నారు. తొలుత హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యదర్శి చంద్రమోహన్ స్వాగతం పలికారు. తెలంగాణ మట్టి వాసనలున్న పల్లె పల్లెకూ పుస్తకం చేర్చాలనే పుస్తక ఉద్యమాన్ని చేపట్టామన్నారు. పలు పోటీల్లో ప్రతిభ కనబర్చిన చిన్నారులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. తెలంగాణ సాహితీ రాష్ట్ర కార్యదర్శి ఆనందాచారి, నిర్వాహకులు సీతారాం, ప్రసేన్, రవిమారుత్, ఐవీ రమణారావు, మువ్వా శ్రీనివాసరావు, సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాల సమన్వయకర్త అట్లూరి వెంకటరమణ, భిన్న కార్యక్రమాల రూపకర్తలు ఫణి మాధవి, కృష్ణవేణి, రూపారుక్మిణి, వెంకటేశ్వర్లు, సుభాషిణి, జయశ్రీ, బాబూరావు, సునంద, వెంకటయ్య, ఎంవీ రమణ తదితరులు పాల్గొన్నారు.