ఖమ్మం, జూన్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): జిల్లాలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జోరందుకున్నాయి. గ్రామగ్రామాన పల్లెప్రగతి కార్యక్రమాల్లో భాగంగా పారిశుధ్య నివారణ చర్యలు, డ్రైనేజీల పరిశుభ్రత, డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాల వద్ద కంపచెట్ల నరికివేత వంటి పనులను నిర్వహించారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఖమ్మం నగర పాలక సంస్థపాటు సత్తుపల్లి, మధిర, వైరా, ఇల్లెందు, మణుగూరు, కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీల్లో పారిశుధ్య నివారణ చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమాలను ప్రజాప్రతినిధులతోపాటు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు సైతం పరిశీలించారు. కల్లూరు మండలం కొర్లగూడెంలో పల్లెప్రగతి కార్యక్రమాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ జాయింట్ కమిషనర్ జగత్‌కుమార్‌రెడ్డి, డీఆర్డీవో విద్యాచందన, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ తాతా మధు తదితరులు పరిశీలించారు.
మధిర మండలంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మధిర పట్టణంలో పట్టణ ప్రగతి కార్యక్రమాల తీరును, బోనకల్లు మండలంలో పల్తె ప్రగతి పనులను కలెక్టర్ వీపీ గౌతమ్ పరిశీలించారు. అన్నపురెడ్డిపల్లిలో జరిగిన పల్లెప్రగతి కార్యక్రమంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆళ్లపల్లి మండలంలో భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య విస్తృతంగా పర్యటించి సాయనపల్లి గ్రామంలో జరిగిన పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖమ్మంలో మేయర్ పునుకొల్లు నీరజ వివిధ డివిజన్లలో పర్యటించి పట్టణ ప్రగతి కార్యక్రమాలను పర్యవేక్షించారు. నేలకొండపల్లిలో జరిగిన పల్లెప్రగతిలో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు. మణుగూరు పట్టణంలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.