ఖమ్మం సిటీ, జూన్ 2: సురక్షిత ప్రసవాలకు కేంద్ర బిందువైన ఖమ్మం ప్రధాన వైద్యశాలలో ఒకే కాన్పులో ముగ్గురు కవలలు జన్మించారు. వైద్యాధికారుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం సంకీస గ్రామానికి చెందిన గర్భిణి కొల్లి సమత రెండు రోజుల క్రితం పురిటి నొప్పులతో వచ్చి కాన్పు కోసం ఖమ్మం పెద్దాసుపత్రిలో చేరింది. ఆమెకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన స్థానిక వైద్యులు.. ఆమె గర్భంలో ముగ్గురు శిశువులు ఉన్నట్లు గుర్తించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ మంగళ, డాక్టర్ తేజారెడ్డి, డాక్టర్ ప్రదీప్‌రెడ్డి (అనస్తీషియా)లు ఆ గర్భిణికి సర్జరీ ద్వారా ప్రసవం జరిపించారు. ఆ క్రమంలో ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించారు. వారిలో ఇద్దరు ఆడ శిశువులు, ఒక మగ శిశువు ఉన్నారు. తల్లి, చిన్నారులు ఆరోగ్యంగా ఉన్నారని, మరో వారం రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు.