ఖమ్మం/ రఘునాథపాలెం/ మామిళ్లగూడెం/ ఖమ్మం ఎడ్యుకేషన్/ ఖమ్మం వ్యవసాయం/ ఖమ్మం సిటీ/ ఖమ్మం లీగల్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు గురువారం ఖమ్మం నియోజకవర్గ వ్యాప్తంగా వైభవంగా జరిగాయి. ఎనిమిదో వసంత వేడుకలు అంబరాన్నంటాయి. సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ఈ రోజు నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని వక్తలు పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వాడవాడలా జరిగాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ జెండా రెపరెపలాడింది. అంతటా పండుగ వాతావరణం సంతరించుకుంది. అన్ని కార్యాలయాల్లో ఆయా కార్యాలయాల అధికారులు, ప్రజాప్రతినిధులు మువ్వన్నెల పతాకాలను ఎగురవేశారు.