ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అంబరాన్నంటాయి.. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.. ‘జై తెలంగాణ.. జై జై తెలంగాణ.. జై ఉద్యమ నేత.. జై జై కేసీఆర్..’ అన్న నినాదాలతో విధులన్నీ హోరెత్తాయి.. తెలంగాణ తల్లి విగ్రహాల వద్ద పూల వానలు కురిశాయి.. అమర వీరుల త్యాగాలను స్మరిస్తూ స్తూపాల వద్ద ప్రజాప్రతినిధులు, అధికారులు, రాజకీయ నాయకులు నివాళులర్పించారు.. ఖమ్మంలో మంత్రి అజయ్‌కుమార్, కొత్తగూడెంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఖమ్మం నగరంలో జరిగిన వేడుకల్లో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ ఎనిమిదేళ్లలో ఉమ్మడి జిల్లాలో జరిగిన అభివృద్ధిని వివరించారు.. బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు.
రైతుబంధు, రైతుబీమా, ఆసరా, దళితబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు ప్రజలకు మేలు చేశాయన్నారు.. దళిత సాధికారత, ఆర్థిక ప్రగతి కోసమే సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ఖమ్మం జిల్లాలో 5,243 డబుల్ బెడ్రూంలను పూర్తి చేసి 4,790 మందికి అందించామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమంలో నంబర్‌వన్ స్థానంలో నిలిచామని పేర్కొన్నారు. కొత్తగూడెంలో జరిగిన వేడుకల్లో రేగా మాట్లాడుతూ కుల వృత్తులకు చేయూతనిచ్చిన తొలి సర్కార్ తెలంగాణ ప్రభుత్వమని పేర్కొన్నారు. పల్లె, పట్టణ ప్రగతితో పల్లె, పట్టణాల రూపురేఖలు మార్చారని పేర్కొన్నారు. భద్రాద్రి జిల్లా నీతి అయోగ్‌లో ఉత్తమ ర్యాంక్ సాధించడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లా అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
