“మన నీళ్లు మనకుండాలె. మన నిధులు మనకు రావాలె.. మన ఉద్యోగాలు మనకు కావాలె” అనే నినాదంతో నాడు ఉద్యమ సారథి కేసీఆర్ పోరుజెండా ఎగురవేశారు. ఆంధ్రా వలస పాలకుల దోపిడీపై ఉక్కు పిడికిలి బిగించారు. జైతెలంగాణ అని నినదించారు. బానిస బతుకులు మనకొద్దంటూ ప్రజలను చైతన్యం పరిచారు. ఉద్యమ నేత కేసీఆర్ 2002 మార్చి 25వ తేదీన వేంసూరు గడ్డపై గర్జించారు. పోరుజెండాను భుజాన ఎత్తుకొని ఊరూవాడను ఏకం చేశారు. తెలంగాణ సాధించి తీరుతానని ప్రకటించారు. అవమానాలు.. అవాంతరాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో పోరుబాటను వీడలేదు. రాష్ర్టాన్ని సాధించి చూపించారు. దాని ఫలాలనూ అందించారు. అందిస్తూనే ఉన్నారు. బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నారు. ఆచరణాత్మకంగా అడుగులు వేస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భవించి నేటితో ఎనిమిది వసంతాలు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో ఉద్యమ నేత కేసీఆర్ వేంసూరు సభ విశేషాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
ఖమ్మం, జూన్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నాగార్జున సాగర్ ఎడమకాలువ ద్వారా జిల్లాలో వేలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందాలి. రైతుల అవసరాలకు అనుగుణంగా వీలైన చోట ఎత్తి పోతల పథకాలు నిర్మించాలి. పంట భూములను సస్యశ్యామలం చేయాలి. కానీ నాటి తెలుగుదేశం ప్రభుత్వానికి ఇవేమీ పట్టలేదు. వ్యవసాయరంగాన్ని పనికి రాని రంగంగా పరిగణించింది. సాగు దండగ అని పక్కన పెట్టేసింది. వేంసూరు ప్రాంతంలోని ఎత్తిపోతల పథకాల ద్వారా 3,200 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా పట్టుమని 1,600 ఎకరాలకు కూడా నీరు అందడం లేదు. ఆంధ్రా ప్రాంతానికి నీరు వెళ్లే నాగార్జున సాగర్ కుడి కాలువపై ఉన్న ఎత్తిపోతల పథకాల ద్వారా పంటలు పండించుకునే రైతులకు విద్యుత్ చార్జీల్లో నాటి ప్రభుత్వం రాయితీ ప్రకటించగా తెలంగాణ ప్రాంత రైతులు మాత్రం కమిటీగా ఏర్పడి బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది. వేంసూరులో వర్షాధారంగా తప్ప పంటలు పండించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో 2002లో రైతులు ఉద్యమ నేత కేసీఆర్‌ను ఆశ్రయించారు. దీంతో కేసీఆర్ వేంసూరు పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ పర్యటన చారిత్రాత్మకమైంది. తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై కదలిరావాలని ఆయన ఇచ్చిన తొలి పిలుపు నాడు జిల్లాను కుదిపివేసింది. రైతాంగాన్ని ఆలోచింపచేసింది.
పర్యటన సాగిందిలా..
ఉద్యమ నేత కేసీఆర్ 25 మార్చి 2002న ఉదయం ఖమ్మానికి చేరుకున్నారు. పట్టణంలోని ఆర్అండ్బీ విశ్రాంతి భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంపై చూపిస్తున్న తీరుపై మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని గణాంకాలతో సహా వెల్లడించారు. స్వరాష్ట్రం వస్తే ఈప్రాంత ప్రజల కష్టాలు ఎలా తీరతాయి.. అనే అంశాన్ని పూసగుచ్చినట్లు వివరించారు. అనంతరం వేంసూరు పర్యటనకు బయల్దేరారు. లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ఉన్న ప్రాంతాల్లో స్వయంగా పర్యటించారు. సాగునీరు లేక ఎండిపోయిన పొలాలను చూసి చలించిపోయారు. రైతుల కష్టాన్ని, కన్నీళ్లను చూసి వారిని ఓదార్చారు. అనంతరం వేంసూరు మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభకు వెళ్లారు.
జన నీరాజనం..
వేంసూరు సభకు సత్తుపల్లి, పెనుబల్లి ప్రాంతాల నుంచే కాక ఆంధ్రా ప్రాంతంలోని చాట్రాయి, చనుబండ, తిరువూరు, విస్సన్నపేట ప్రాంతాల నుంచి వందలాది మంది ప్రజలు పార్టీలకు అతీతంగా తరలివచ్చి నీరాజనాలు పలికారు. సభావేదికపై ఉద్యమ నేత కేసీఆర్ చేసిన ప్రసంగం రాష్ట్రంలోనే ప్రకంపనలు సృష్టించింది. తెలంగాణ సాధించేంత వరకు వెనుదిరగనని ఆయన చేసిన ప్రకటన ఉద్యమకారులకు ఊపునిచ్చింది. నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ రంగాన్ని పట్టించుకోకపోవడం, విద్యుత్ కోతలు విధించడం, సాగునీటి సమస్యలను పక్కన పెట్టడంపై కేసీఆర్ సభలో గర్జించారు. రైతుల బాధలు, సమస్యలు తీర్చని టీడీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. మొత్తానికి సభకు సంబంధించిన జ్ఞాపకాలు ఇప్పటికీ వేంసూరు రైతుల గుండెల్లోనే ఉన్నాయి. నాటి సభలో టీఆర్ఎస్ జిల్లా కన్వీనర్ డాక్టర్ గోపీనాథ్, మాజీ శాసనసభ్యుడు దేశిన చిన్నమల్లయ్య పాల్గొన్నారు. రైతుల సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లిన బండి అంజిరెడ్డి సభకు సారథ్యం వహించారు. ఆ జ్ఞాపకాలు మరువకముందే 2009 నవంబర్ 29న ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణ సాధనకు ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అని నిరాహార దీక్షకు దిగడం, నాటి పాలకులు ఆయన్ను అరెస్టు చేసి ఖమ్మానికి తీసుకురావడం జరిగింది. ఆయన్ను ఖమ్మం జిల్లాకు చెందిన ఉద్యమ నేతలు, నాయకులు కాపాడుకున్న తీరు ఇప్పటికీ కళ్ల ముందే కదలాడుతూనే ఉంది. ఈ ఘట్టాలన్నీ ఖమ్మం జిల్లాలో ఉద్యమం ఉవ్వెత్తున సాగడానికి ఊపిరినిచ్చాయి. మలి, తుది దశ ఉద్యమాలకు దిశ నిర్దేశం చేశాయి.
బహిరంగ సభ హైలైట్స్..
నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవసాయ రంగంపై చూపుతున్న వివక్షను కేసీఆర్ ఎండగట్టారు. రైతులు పంటలకు వినియోగించుకున్న విద్యుత్‌కు చార్జీలు వసూలు చేయడంపై తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. వ్యవసాయానికి విద్యుత్‌కు బిల్లులు చెల్లించాల్సిన అవసరంలేదని తమ పార్టీ ప్రభుత్వాన్ని కోరిందని ప్రకటించారు. తదగుణంగా ఉత్తర్వులు జారీ చేస్తామని టీడీపీ సర్కార్ రైతులను మభ్యపెట్టిందని మండిపడ్డారు. తెలంగాణపై నాటి సర్కారు చూపుతున్న వివక్షను సోదాహరణంగా వెల్లడించారు. నాగార్జునసాగర్ నీటి పంపకాలపై జరుగుతున్న అన్యాయాన్ని రైతులకు కళ్లకు కట్టినట్లుగా వివరించారు. సభ తర్వాత ఉద్యమకారులతో కలిసి అనేక పోరాటాలు చేసి ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ చార్జీలు మినహాయించేలా చేశారు. దీంతో వేంసూరు రైతులకు కేసీఆర్ ఆరాధ్యదైవంగా మారారు. నాటి నుంచి కేసీఆర్ అడుగులో అడుగువేసిన రైతులు ఆయనకు అండగా నిలుస్తూనే ఉన్నారు.
స్వరాష్ట్రంలో నీటి పరవళ్లు..
నాడు రైతుల దీనస్థితిని గమనించిన ఉద్యమ నేత కేసీఆర్ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా జిల్లాలో సాగునీటి సమస్యలను పరిష్కరించారు. నాటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పువ్వాడ అజయ్‌కుమార్ కృషితో జిల్లాలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభించింది. భక్తరామదాసు ప్రాజెక్టుతో వేలాది ఎకరాలు సస్యశ్యామలమయ్యాయి. ఎన్నెస్పీ కెనాల్స్‌ను పటిష్టం చేయడంతో పంటలకు సజావుగా నీరు అందుతున్నాయి. మణుగూరు శివారులో ప్రతిష్ఠాత్మకంగా భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్) ఏర్పాటైంది. ఖమ్మం నగరంలో నిర్మించిన ఐటీ హబ్‌తో వందలాది మంది యువతకు ఉపాధి లభించింది. గోదావరి జలాలను ఉమ్మడి జిల్లాలోని పంట భూములకు తరలించేందుకు సీతారామప్రాజెక్టు రూపుదిద్దుకుంటున్నది. ప్రాజెక్టు నిర్మాణం యుద్ధప్రాతిపదికన జరుగుతున్నది. ప్రాజెక్టు పూర్తయితే ఉభయ జిల్లాలో లక్షలాది ఎకరాలకు పుష్కలంగా సాగునీరు అందనున్నది. గోదావరిపై సీతమ్మసాగర్ పేరుతో మరో బహుళార్థ సాధక ప్రాజెక్టు ప్రారంభం కానున్నది.
పరేడ్ గ్రౌండ్ ముస్తాబు
మామిళ్లగూడెం, జూన్ 1: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌ను పోలీస్ అధికారులు ముస్తాబు చేశారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ గురువారం ఉదయం 9 గంటలకు జెండా ఆవిష్కరణ చేయనున్నారు. అనంతరం పోలీస్‌శాఖ నుంచి గౌరవ వందనం స్వీకరించనున్నారు. పోలీస్ మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను బుధవారం సీపీ విష్ణు ఎస్ వారియర్ పరిశీలించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నగరంలో ప్రధాన కూడళ్లు విద్యుత్ కాంతులతో నూతన శోభను సంతరించుకున్నాయి. కలెక్టరేట్, జిల్లా పరిషత్ కార్యాలయం, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వంటి ప్రభుత్వ కార్యాలయాలన్నీ విద్యుత్ వెలుగులతో కాంతులీనుతున్నాయి.
కేసీఆర్ కార్యదీక్షతోనే తెలంగాణ: ఎంపీ నామా
ఖమ్మం, జూన్ 1: కేసీఆర్ కార్యదీక్ష, పట్టుదలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాష్ట్ర ప్రజలకు ఈ రోజు ఒక పండుగ రోజులాంటిదని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన అనంతరం జరుగుతున్న అభివృద్ధితో ప్రజలకు ఆకాంక్షలు నెరవేరాయని గుర్తుచేశారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.