ఖమ్మం, జూన్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఈ నెల 3 నుంచి చేపట్టే పల్లె, పట్టణ ప్రగతి, బడిబాట కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సూచించారు.. అధికారులందరూ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని, స్థానిక ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ‘పల్లె, పట్టణ ప్రగతి, బడిబాట’ కార్యక్రమాలపై కలెక్టర్ వీపీ గౌతమ్ ఆధ్వర్యంలో ఖమ్మంలోని డీపీఆర్సీ భవనంలో జిల్లా అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వ పథకాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేయడమే విజయానికి కారణమని పేర్కొన్నారు. ఈ ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ మీడియం తరగతుల నిర్వహణను పటిష్ట పరచాలని ఆదేశించారు. పాఠశాలల్లో కనీస సౌకర్యాలు పకాగా ఉండేలా చూడాలన్నారు. ప్రమాదకరంగా ఉన్న భవనాలు, చెట్లను గుర్తించి వాటిని తొలగించాలన్నారు . పాఠశాల ఆవరణలో మొకలు, తాగునీరు, టాయిలెట్లు కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
డ్రాపౌట్స్‌ను గుర్తించి పాఠశాలల్లో చేర్చే విధంగా కృషి చేయాలని సూచించారు.చిన్నచిన్న పనులు ఏవైనా ఉంటే ఈ విడత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో చేసుకోవాలని సూచించారు. తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, పట్టణ ప్రకృతి వనాలు, నర్సరీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గడచిన 4 విడతల పల్లె, పట్టణప్రగతి కార్యక్రమాలను అద్భుతంగా చేశామని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో విడతను కూడా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా పక్కాగా పారిశుధ్య పనులు చేపట్టడం వల్ల సీజనల్ వ్యాధులు గణనీయంగా తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయన్నారు.
మండలానికి ఒక ప్రత్యేక అధికారి: కలెక్టర్
ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఒకేసారి చేపట్టేవి కావని, నిరంతర కార్యక్రమాలని అన్నారు. ప్రతి మండలానికీ ఒక జిల్లాస్థాయి అధికారిని, ప్రతి గ్రామానికీ ఒక మండల స్థాయి అధికారిని ప్రత్యేక అధికారులుగా నియమించామన్నారు. జిల్లాలో 753 క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకుగాను 272 చోట్ల స్థల సేకరణ చేశామన్నారు. 52 చోట్ల గ్రౌండింగ్ జరిగిందన్నారు. 40 చోట్ల గురువారం పనులు పూర్తవుతాయని, వెంటనే వాటిని ప్రారంభిస్తామని అన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసుకున్న వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లను పూర్తిగా వినియోగంలోకి తేవాలని, ఆ మేరకు గ్రామస్తులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
ప్రగతి స్పష్టంగా కన్పిస్తోంది: ఎమ్మెల్సీ తాతా మధు
ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణతో ప్రగతి స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. భవిష్యత్తులో అవసరమైన ప్రాంతాలను గుర్తించి కార్యాచరణతో ముందుకు సాగాలన్నారు. ఉత్తమ పంచాయతీ, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, సెగ్రిగేషన్ షెడ్లకు బహుమతులు ప్రకటిస్తే.. పోటీతత్వంతో మంచి ఫలితాలు వస్తాయన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. అందరం భాగస్వాములమై పట్టుదలతో పనిచేయడంతోనే పల్లెలు, పట్టణాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ.. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా సీజనల్ వ్యాధులు కట్టడి చేయగలిగామన్నారు . అదనపు కలెక్టర్ మొగిలి స్నేహలత, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.