లక్ష్మీదేవిపల్లి, మే 30: భద్రాద్రి జిల్లాలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. పలుచోట్ల ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. విద్యుత్తు స్ంతభాలు, చెట్లు నేలకొరిగాయి. జూలూరుపాడు నుంచి వినోభానగర్ గ్రామాల మధ్య ప్రధాన రహదారి పక్కన ఉన్న చెట్లు బలమైన గాలులకు పడిపోవడంతో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
ఆదివారం సాయంత్రం నుంచి గాలిదుమారం, భారీ వర్షానికి మండలంతోపాటు కొత్తగూడెం పట్టణంలో అనేకచోట్ల విద్యుత్ స్తంభాలు కూలాయి. విద్యుత్ తీగెలు తెగిపడ్డాయి. రాత్రంతా పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రైల్వే స్టేషన్ ప్రాంగణంలోని భారీ వేప చెట్టు కూలి విద్యుత్ తీగెలపై పడటంతో పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్, పోల్స్, తీగెలు తెగిపడ్డాయి. విద్యుత్ శాఖాధికారులు, సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. మొత్తం 35 ట్రాన్స్ఫార్మర్లు, 28 స్తంభాలు విరిగినట్లు/కూలినట్లు గుర్తించారు. డీఈ విజయ్ పర్యవేక్షణలో కొన్నిచోట్ల వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. సోమవారం తెల్లవారుజామున నుంచి మధ్యాహ్నం వరకు అన్నోచోట్ల స్తంభాలను నిలబెట్టి, తీగలను సరిచేశారు. సాయంత్రానికి సరఫరాను పూర్తిస్థాయిలో పునరుద్దరించారు.
జూలూరుపాడు మండలంలో భారీ వర్షం
జూలూరుపాడు, మే 30: మండలంలోని కొన్ని గ్రామాల్లో సోమవారం సాయంత్రం అరగంటపాటు బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. జూలూరుపాడు-వినోభానగర్ ప్రధాన రహదారి పక్కనున్న కొన్ని చెట్లు కూలాయి. వాటిని స్ధానికులు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. జూలూరుపాడు, పాపకొల్లు గ్రామాల్లో కొన్ని రేకుల ఇండ్లపై కప్పులు ఎగిరిపడ్డాయి. విద్యుత్ తీగెలు తెగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
నష్టంపై ఎమ్మెల్యే వనమా ఆరా
భద్రాద్రి కొత్తగూడెం, మే 30 (నమస్తే తెలంగాణ): కొత్తగూడెం నియోజకవర్గంలో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు గాలివాన బీభత్సం సృష్టించింది. చెట్లు విరిగి పడ్డాయి. కరెంట్ స్తంభాలు కూలిపోయాయి. ఇళ్లపై ఉన్న హోర్డింగ్‌లు కూలిపడ్డాయి. దీనిపై ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆరా తీశారు. ఆయన సోమవారం మున్సిపల్, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖ అధికారుతో ఫోన్లో మాట్లాడారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలన్నారు.
విద్యుదాఘాతంతో ఆవు లేగ దూడ మృతి
పాల్వంచ, మే 30: పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని పేటచెరువు సమీపంలో ఆదివారం సాయంత్ర గాలిదుమారంతో త్రీఫేస్ లైన్ విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. రైతులు కనగాల నవీన్, పాకనాటి నాగేశ్వరరావుకు చెందిన పాడి గేదె, లేగ దూడ సోమవారం మేత కోసం అటువైపు వెళ్లాయి. ఆ తీగలు తగలడంతో అవి అక్కడికక్కడే మృతి చెందాయి. వీటి విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని బాధిత రైతులు తెలిపారు.
పిడుగుపాటుతో గేదె..
పాల్వంచ రూరల్, మే 30: మండలంలోని బండ్రిగొండ గ్రామంలో ఆదివారం రాత్రి కంటే వెంకటప్పయ్య ఇంటి వద్ద ఆయనకు చెందిన గేదె పిడుగుపాటుతో మృతి చెందింది. దాని విలువ దాదాపు రూ.లక్ష ఉంటుందని బాధిత రైతు తెలిపాడు.