
కొత్తగూడేనికి చెందిన ఓ ఉద్యోగికి మహిళ అనే పదమే నచ్చదు. మరి ఎలా వివాహం చేసుకున్నాడో తెలియదు గానీ భార్యను ఎల్లప్పుడూ వేధించేవాడు. వారికి ఒక కుమార్తె. వారి వైవాహిక జీవితమంతా అల్లకల్లోలంగా ఉండేది. భర్త ఆడవాళ్లంటే ఇష్టం ఉండదు అని బహిరంగంగా చెప్పేవాడు. అకారణంగా అసహ్యించుకునేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులు సఖి కేంద్రాన్ని సంప్రదించింది. సఖి బృందం ఐదు నెలల పాటు భర్తకు అనేకసార్లు కౌన్సిలింగ్ ఇచ్చింది. ఆ తర్వాత అతనిలో మార్పు వచ్చింది. భార్యను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆ కుటుంబం ప్రస్తుతం పిల్లా పాపలతో సంతోషంగా ఉన్నది. ఇలాంటి ఎన్నో సమస్యలను పరిష్కరించి సఖి కేంద్రం వందల కుటుంబాలను నిలబెడుతున్నది.
ఆమెకు మతిస్థిమితం సరిగాలేదు. నిండు గర్భిణి. పాపం ఎవరిదో తెలియదు గానీ మణుగూరు రైల్వేస్టేషన్లో ఒంటరిగా రైలు దిగింది. స్టేషన్ ఆవరణలో ఉన్న చెత్తాచెదారంలో అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ‘సఖి’ బృందం నిమిషాల్లో అక్కడికి చేరుకున్నది. కొత్తగూడెంలోని కేంద్రానికి తరలించింది. వైద్యపరమైన సహకారం అందించి బాధితురాలు పండంటి బిడ్డకు జన్మనిచ్చేలా అండగా నిలిచింది. అనంతరం తల్లీ బిడ్డను ఖమ్మంలోని శిశు గృహానికి తరలించింది. ఆ తర్వాత వారిద్దరికి అన్నం ఫౌండేషన్ ఆశ్రయం కల్పించింది..
కొత్తగూడెం, సెప్టెంబర్ 8: గృహహింస, బాల్యవివాహాలు, లైంగిక వేధింపులు, వరకట్న వేధింపులు, లైంగికదాడి కేసుల్లో బాధితులకు అండగా నిలుస్తున్నది ‘సఖి’ కేంద్రం. కొత్తగూడెం జిల్లాకేంద్రం 2019 లో ఏర్పాటైన ఈ కేంద్రం ద్వారా చట్టపరమైన, న్యాయపరమైన సహాయ సహకారాలు బాధితులకు అందుతున్నాయి. ఇప్పటివరకు వందలాది మంది బాధితులు తమ సమస్యలను పరిష్కరించుకున్నారు. కౌన్సిలింగ్ ద్వారా, న్యాయపోరాటం ద్వారా బృందం బాధితులకు న్యాయం చేస్తున్నది. సమస్య ఏదైనా బాధితురాలు 181కు ఒక్క కాల్ చేస్తే చాలు సఖి బృందం నిమిషాల్లో అక్కడికి చేరుకుంటుంది. సమస్య తీవ్రతను బట్టి కేసులు నమోదు చేస్తున్నది. జిల్లాలో ఎంత మారుమూల ప్రాంతమైనా రెస్క్యూ వ్యాన్‌లో బృందం బయల్దేరుతున్నది. ఇప్పటివరకు గుండాల, ఆళ్లపల్లి, చర్ల, దుమ్ముగూడెం వంటి పూర్తి ఏజెన్సీ మండలాలకూ వెళ్లి బాధితులకు అండగా నిలిచింది. 14 మంది సభ్యులు ఉన్న ఈ బృందం బాధితులకు భరోసా ఇస్తున్నారు. వీరికి లీగల్ అడ్వైజర్, ఏఎన్ఎం, పోలీస్ సిబ్బంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. సఖి కేంద్రం వద్దకు ఇప్పటివరకు 761 కేసులు రాగా వాటిలో 584 కేసులను పరిష్కరించింది. వీటిలో ఎక్కువగా గృహ హింస, లైంగిక వేధింపులు, బాల్యవివాహాలు తదితర కేసులు ఎక్కువగా ఉన్నాయి. అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి బృందం నిర్విరామంగా పనిచేస్తున్నది.
బాధితులకు ఆశ్రయం..
బాధితులు ఏ సమస్య మీద వచ్చినా సఖి టీం వారికి ఆశ్రయం ఇస్తున్నది. ఐదు పడకల భవనంలో వసతి, భోజన సౌకర్యం కల్పిస్తున్నది. వైద్య సేవలకు ఒక ఏఎన్ఎం, న్యాయపరమైన సేవలకు లీగల్ అడ్వైజర్నూ నియమించింది. జిల్లా సంక్షేమశాఖ అధికారిణి వరలక్ష్మి నేతృత్వంలో సఖి అడ్మిన్, బృందం పని చేస్తున్నది. ఉదాహరణకు గృహహింస కేసు తీసుకుంటే బాధితురాలు సఖిని సంప్రదించిన వెంటనే బృందం బాధితురాలి ఇంటికి వెళ్తుంది. ఆమె సమస్యను కూలంకషంగా తెలుసుకుంటుంది. తీవ్రతను బట్టి బాధితురాలిని సఖి కేంద్రానికి తరలిస్తుంది. బృందం బాధితురాలికి అండగా నిలిచి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయిస్తుంది. ఆ తర్వాత బృందం పోలీసుల సహకారంతో వేధిస్తున్న వ్యక్తిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపిస్తుంది. పోలీసులతో కౌన్సెలింగ్ ఇప్పిస్తుంది. అప్పటికీ సమస్యకు పరిష్కారం లభించకపోతే ‘సఖి’ బృందంలోని లాయర్ ద్వారా కోర్టును ఆశ్రయిస్తుంది. ఆ తర్వాత న్యాయపోరాటం ద్వారా బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తుంది.
ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది..
సమస్యను అర్థం చేసుకుంటే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. లోపం ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. కొన్ని సమస్యలను కౌన్సిలింగ్‌తో పరిష్కరించవచ్చు. నిరక్షరాస్యతతోనే సమాజంలో బాల్య వివాహాలు జరుగుతున్నాయి. మరోవైపు భార్యాభర్తల గొడవలు ఎక్కువగా బయటకు వస్తున్నాయి. వాటిని పరిష్కరిస్తున్నాం. గోప్యంగా ఉంచాల్సిన వాటిని అలాగే ఉంచుతున్నాం. మహిళలు ఎవరైనా నిర్భయంగా సఖి కేంద్రానికి రావొచ్చు. తమ సమస్యలు పరిష్కరించుకోవచ్చు.
-శుభశ్రీ, సఖి అడ్మిన్