ఖమ్మం కల్చరల్, మే 25: శ్రీరామ భక్తాగ్రేసరుడు.. భక్త కోటి ఆరాధ్య దైవం ఆంజనేయ స్వామికి తమలపాకులు, సింధూరం, పలు విశేష పూజలు చేసి తరించారు. వైశాఖమాసం బహుళ దశమి బుధవారం హనుమజ్జయంతిని భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులతో జరుపుకొన్నారు. ధైర్యం, శక్తిని ప్రసాదించి భయాందోళనలను పారదోలే భక్తుల కొంగు బంగారం అభయాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గల ఆంజనేయస్వామి ఆలయాలు, రామాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయాల్లో కొలువైన ఆంజనేయస్వామికి తమలపాకులు, సింధూరం ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు. సుందరాకాండ, హనుమాన్ చాలీసా పారాయణాలతో స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఖమ్మం కాల్వొడ్డు శ్రీసత్యనారాయణ సహిత వీరాంజనేయ స్వామి దేవస్థానంలో 1.25 లక్షల తమలపాకులతో అర్చనలు చేశారు. చెరువుబజార్ శ్రీదాసాంజనేయ స్వామి దేవస్థానంలో అష్టోత్తర శత కలశాలతో పంచామృతాలతో అభిషేకం చేశారు. కమాన్బజార్ శ్రీహనుమాన్ దేవాలయంలో వైభవంగా హనుమజ్జయంతి ఉత్సవం నిర్వహించారు.