
కూసుమంచి, సెప్టెంబర్ 8: ఏ పార్టీకైనా, ఏ ప్రభుత్వానికైనా బలమైన పునాదులే అండగా ఉంటాయని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రామ కమిటీల్లో 50 శాతం రిజర్వేషన్ పాటించాలని సూచించారు. కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన టీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కమిటీలే వచ్చే ఎన్నికలకు దారిచూపిస్తాయని అన్నారు. అందుకే సమర్థులకే అవకాశం ఇవ్వాలని కోరారు. జిల్లాలో సభ్యత్వాల నమోదులో పాలేరు నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందని, తరువాత సత్తుపల్లి రెండో స్థానంలో ఉందని అన్నారు.
అగ్రగామిగా ఉంచండి: కందాళ
జిల్లాలో సభ్యత్వ నమోదులో పాలేరును ఎలా అయితే అగ్రగామిగా ఉంచారో పార్టీ గ్రామ, మండల కమిటీల ఎన్నికల్లోనూ ముందంజలో ఉంచాలని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి టీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. మంచిగా పని చేసే వారికి బాధ్యతలు అప్పగించాలన్నారు.
కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి: తాతా మధు
కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు అన్నారు. పార్టీ ఆదేశాలను తప్పకుండా పాటించాలని కోరారు. టీఆర్ఎస్ నాయకులు చాట్ల పరశురాం, స్వర్ణకుమారి, బెల్లం వేణు, ఉన్నం బ్రహ్మయ్య, పాషబోయిన వీరన్న, జడ్పీటీసీ ఎండపల్లి వరప్రసాద్ ఎంపీపీలు బాణోత్ శ్రీనివాస్, బోడా మంగీలాల్, వజ్జా రమ్య, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, రైతుబంధు సమితి అధ్యక్షుడు బాణోత్ రాంకుమార్, చావా శివరామకృష్ణ, శాఖమూరి సతీశ్, పీఏసీఎస్ అధ్యక్షుడు వాసంశెట్టి వెంకటేశ్వర్లు, నలబోలు చంద్రా రెడ్డి, చావా వేణు, ఏనుగు ధర్మారెడ్డి పాల్గొన్నారు.