
తల్లాడ, సెప్టెంబర్ 8: మేధస్సుతో అన్నదాతలకు ఉపయోగపడే నూతన ఆవిష్కరణ ద్వారా తెలంగాణ ఖ్యాతిని జాతీయస్థాయిలో ఇనుమడింపజేశారు ఓ విద్యార్థి. తల్లాడ మండలం బాలభారతి విద్యాలయానికి చెందిన పదోతరగతి విద్యార్థి తాళ్లూరి ఉదయ్‌కిరణ్ జాతీయస్థాయి అవార్డుకు ఎంపికయ్యాడు. దేశ వ్యాప్తంగా 60 మంది బాలమేధావులు ఎంపిక కాగా తెలంగాణ నుంచి ఎంపికైనవారిలో ఉదయ్‌కిరణ్ ఒకరు. రైతులు పండించిన మిర్చిని బస్తాల్లో నింపడం రైతుకు కష్టంగా మారింది. కూలీలు దొరకకపోవడం, ఎక్కువ సమయం పట్టడం, కూలీల కాళ్లకు వచ్చే అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని వాటిని అధిగమించేలా ఉదయ్‌కిరణ్ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. 4 గంటల్లో ముగ్గురు కూలీలతో 80 బస్తాలు నింపడానికి చిల్లీ బ్యాగ్ ఫిల్లర్ ఆవిష్కరించారు. ఈ నెల 4 నుంచి 8 వరకు ఆన్లైన్ వేదిక ద్వారా జాతీయ ఎండోవేషన్ ఫౌండేషన్ నిర్వహించిన ఇన్స్పైర్ పోటీల్లో ఆయన ఆవిష్కరణ జాతీయ ఉత్తమ ప్రదర్శనకు ఎంపికైంది. జాతీయస్థాయిలో అత్యుత్తమ 60 ప్రదర్శనలో చిల్లీబ్యాగ్ఫిల్లింగ్ ఆవిష్కరణ చోటు దక్కింది. జాతీయ స్థాయి ప్రతిభా అవార్డుకు ఎంపికయ్యాడు.
శాస్త్రవేత్త కావాలన్నదే లక్ష్యం: ఉదయ్‌కిరణ్
నేను ప్రదర్శించిన చిల్లీ బ్యాగ్ ఫిల్లింగ్ ఆవిష్కరణకు జాతీయస్థాయి ప్రతిభా అవార్డు దక్కడం ఆనందంగా ఉంది. ఈ ఆవిష్కరణ రైతులకు ఉపయోగపడాలన్నదే నా ఆశయం. సైన్స్ పట్ల ఆసక్తిని, ప్రతిభను మరింతగా పెంపొందించుకొని శాస్త్రవేత్తగా రాణించాలన్నదే నా లక్ష్యం.