భద్రాద్రి కొత్తగూడెం, మే 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా? గత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాల సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్లింది? అధికారంలో ఉన్న పార్టీ నేతలు, వారి అనుయాయులకు తప్ప ఇతరులకు అందాయా? లంచం ఇవ్వకుండా ప్రజలకు సంక్షేమ ఫలాలు చేరువయ్యాయా? దళారుల దోపిడీ రాజ్యమేలిన సంగతి వాస్తవం కాదా? ప్రభుత్వ పథకాల్లో సగం వారు లాగేసుకుని మిగిలింది లబ్ధిదారులకు ఇచ్చిన ఘటనలు నిజం కాదా? ఇవన్నీ ఇప్పుడు కళ్ల ముందు కదలాడుతున్నాయి. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయి.
దళారుల ప్రమేయం లేదు. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలనే భేదం లేదు. అర్హులు ఏ పార్టీ వారైనా పథకాలు వారి గుమ్మానికి చేరుతున్నాయి. ‘రైతుబంధు ‘రైతుబీమా’ కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా, కేసీఆర్ కిట్లు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం ఇండ్లు.. ఇలా ఏ పథకం అమలు చేసినా వాటి వెనుక ఒక్కటే నినాదం ఉంటుంది.. అదే సంక్షేమం. ఏ పథకాన్ని అమలు చేసినా దానిని పారదర్శకంగా అమలు చేయడం సీఎం కేసీఆర్ ప్రత్యేకత. ఈ విధానాన్ని పార్టీలకు అతీతంగా నాయకులు స్వాగతిస్తున్నారు.ఇన్ని పథకాలు లబ్ధిదారులకు చేరువ చేసిన ప్రభుత్వానికి అండగా ఉందామా? ప్రజలను గందరగోళానికి గురి చేయడానికి పాదయాత్రలు చేస్తూ టూరిస్టుల్లా వచ్చి పోతున్న నేతల కల్లబొల్లి మాటలు విందామా? ప్రజలారా! ఒక్కసారి ఆలోచించండి..
ఉమ్మడి పాలనలో ప్రజలు పీడనకు గురయ్యారు.వారికి పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందలేదు. పంటలకు రోజుకు మూడు నాలుగు గంటలు కరెంట్ ఇస్తే రైతులు చేలల్లో పడిగాపులు కాశారు. పంటకు నీరు అందక పంట ఎండిపోతే ఆత్మహత్య చేసుకున్న ఘటనలూ ఉన్నాయి. రైతులకు రుణాలు సక్రమంగా అందేవి కావు. రుణమాఫీతో లబ్ధిపొందిన వారు చాలా తక్కువ. ఇక రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలకు ఆస్కారమే లేదు. ఇప్పుడు ‘కులం లేదు.. మతం లేదు.. ప్రాంతం లేదు.. వర్గం లేదు..’ తెలంగాణ ప్రభుత్వం అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నది.
రైతుబంధు, రైతుబీమా, ఆసరా, దళితబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం ఇండ్లు.. ఇలా ఏ పథకం ప్రవేశపెట్టినా వాటి వెనుక ఒక్కటే నినాదం ఉంటుంది. అదే సంక్షేమం. ఏ పథకాన్ని అమలు చేసినా దానిని పారదర్శకంగా అమలు చేయడం సీఎం కేసీఆర్ ప్రత్యేకత. ఈ విధానాన్ని పార్టీలకు అతీతంగా నాయకులు స్వాగతిస్తున్నారు. తెలంగాణ రాకుంటే ఇలాంటి పథకాలు ప్రజలకు అందేవి కావని ఘంటాపథంగా చెప్తున్నారు. ఇంతకు ముందు మరే ఇతర ప్రభుత్వమూ ఇన్ని రకాల పథకాలు అమలు చేయలేదంటున్నారు. రైతుబంధుతో రైతులకు పెట్టుబడి బాధలు తప్పాయంటున్నారు.
అన్ని పార్టీల నాయకులు స్వాగతించాలి..
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ మంచివే. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, రైతుబంధు ప్రజలకు మేలు చేస్తున్నాయి. ఎక్కడా దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు పథకాలు అందుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అయినా, ఏ పార్టీ వారైనా మంచి పథకాలను స్వాగతించాల్సిందే. మంచి చేసే వాళ్లకి సహకారం అందించాల్సిందే. గతంలో అమలు చేసిన పథకాలు దళారుల ప్రమేయంతో లబ్ధిదారులకు సరిగా అందేవి కావు. ఇప్పుడా పరిస్థితి లేదు.
– కొడుమూరు దయాకర్‌రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు, చండ్రుగొండ
రైతుబీమా పరిహారం అందింది..
మా నాన్న రైతు. కొన్నాళ్ల క్రితం ఆయన మరణించారు. మా కుటుంబానికి రైతుబీమా ద్వారా రూ.5 లక్షల పరిహారం అందింది. నాకు కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం. ఆ పార్టీ అభిమానిని. తెలంగాణ ప్రభుత్వం మంచి పథకాలను అమలు చేస్తున్నది. రైతుబీమా పథకం రైతు కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నది. ప్రమాదవశాత్తు కుటుంబ యజమాని చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పథకాన్ని అమలు చేస్తున్నారు. రైతుబంధు పథకమూ మంచి పథకమే. రైతులు పెట్టుబడులకు ఇబ్బందిపడకుండా ప్రభుత్వమే సాయం అందించడం మంచి ఆలోచన.
– కల్తీ రాంప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పెనుగడప, చుంచుపల్లి మండలం
రైతుబంధుతో రైతులకు భరోసా..
రైతులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు అమలు చేస్తున్నది. దేశంలో ఏ ఇతర రాష్ట్రం ఇలాంటి పథకం అమలు చేయడం లేదు. ఈ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది. నాకున్న ఐదెకరాల భూమికి ఏడాదికి రెండు విడతలుగా రూ.50 వేల రైతుబంధు అందుతున్నది. పంటలకు 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ అందుతున్నది. సాగునీటి ఇబ్బందులేమీ లేవు. గత ప్రభుత్వాలు వ్యవసాయం దండుగ అన్నాయి. కానీ పండుగ అని సీఎం కేసీఆర్ నిరూపిస్తున్నారు.
–దేశిన్ని శ్రీనివాసరావు, గ్రామస్తుడు, కాకర్లపల్లి, సత్తుపల్లి మండలం
రైతుబంధు ఠంచనుగా అందుతున్నది..
నాకు ఆరు ఎకరాల భూమి ఉంది. ఏటా రెండు సార్లు నా ఖాతాలో ఠంచనుగా రైతుబంధు జమ అవుతున్నది. నిరుపేదల కోసం ప్రభుత్వం మంచి పథకాలు అమలు చేస్తున్నది. గతంలో ఏ ప్రభుత్వమూ ఇన్ని పథకాలు అమలు చేయలేదు. ఇప్పటివరకు చేస్తున్న పథకాలన్నీ ప్రజాదరణ పొందాయి. మున్ముందు మరిన్ని పథకాలు అమలు చేయాలి.
– గుగులోత్ బాబు, మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, చండ్రుగొండ
అండగా ఆసరా పింఛను
గతంలో పాలించిన ప్రభుత్వాలు పింఛను గురించి పట్టించుకోలేదు. నామమాత్రంగా వృద్ధులు, దివ్యాంగులకు పింఛను ఇచ్చేవి. నెలవారీగా అందే పింఛనుతో కనీస అవసరాలు కూడా తీరేవి కావు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్లు అమాంతం పెంచారు. పింఛను పింఛనుదారులకు భరోసానిస్తున్నది. రైతుబీమా కూడా చరిత్రలో నిలిచిపోయే పథకం. దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదు.
– బుల్లోజు మోహనాచారి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు, కొత్తగూడెం
రైతుబంధు దేశానికే ఆదర్శం..
ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధు పథకం దేశానికే ఆదర్శం. గతంలో ఎన్నో ప్రభుత్వాలను చూశాం. కానీ ఏ ప్రభుత్వమూ రైతులను పట్టించుకోలేదు. నేడు కేసీఆర్ పంటలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయిస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతులను ఆదుకుంటున్నారు. రాష్ర్టాన్ని కోటి ఎకరాల మాగాణి చేశారు. ఇలాంటి ముఖ్యమంత్రి దొరకడం రైతుల అదృష్టం.
– చల్లారి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ, సత్తుపల్లి
ఆడపిల్లలకు వరం కల్యాణలక్ష్మి..
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి ఆడపిల్లలకు వరం. ఈ పథకం ఎంతోమంది నిరుపేద కుటుంబాలను ఆదుకున్నది. ఆడపిల్లల పెండ్లికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నది. అమ్మాయి వివాహం తల్లిదండ్రులకు భారం కావొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పథకాన్ని అమలు చేస్తున్నారు. రైతులకు అనుకూలంగా రాష్ట్రంలో పథకాలు అమలవుతున్నాయి.
– నల్లమల రమేశ్, ముటాపురం, నేలకొండపల్లి
ప్రభుత్వ పథకాలు ప్రజలకు వరం..
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వరం. ఒకవైపు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూనే మరోవైపు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నది. సాగును పండుగ చేసేందుకు 24 గంటల పాటు పంటలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నది. రైతుబంధు, రైతుబీమా పథకాలు రైతులకు ఎంతో భరోసానిస్తున్నాయి. ప్రతి ఇంటికీ ఏదో ఒక విధంగా ప్రభుత్వ పథకాలు అందుతుండడం విశేషం.
– కిన్నెర లాజరు, గ్రామస్తుడు, వేంసూరు