
తల్లాడ, సెప్టెంబర్ 8: గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి చెప్పినట్లు.. ‘గర్భగుడిలాంటి అమ్మ ఒడి పాము పడగ’లా అయినట్లుంది ఈ హృదయవిదారక దృశ్యం. అమ్మ చనుబాలు తాగుతూ బుజ్జి పొట్టను నింపుకోవాల్సిన ఆ పసికందు.. గుక్కపట్టి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయాడు. తల్లి పొత్తిళ్లలో తనివితీరా పవళించాల్సిన ఆ నవజాత శిశువు.. ముళ్ల పొదల్లో ఒంటి నిండా గాయాలతో సొక్కిపోయాడు. ఈ అమానవీయ ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం ముద్దునూరు గ్రామంలో బుధవారం సాయంత్రం వెలుగుచూసింది.
ముద్దునూరు గ్రామానికి చెందిన సోమా ప్రకాశ్ తన పశువులకు పశుగ్రాసం కోసేందుకు బుధవారం సాయంత్రం గ్రామ కూడలి ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ పసి గుడ్డు ఏడ్పు వినిపించింది. ఆందోళన చెందిన అతడు.. అటువైపు వెళ్లి చూడగా అంతకు కొద్ది గంటల క్రితమే పుట్టిన మగ శిశువు కన్పించాడు. వెంటనే చుట్టుపక్కల వారిని పిలవగా అందరూ అక్కడికి చేరుకున్నారు. కొంతమంది గ్రామస్తులు ఆ శిశువును అక్కున చేర్చుకొని ఐసీడీఎస్ సూపర్వైజర్ సత్యవతికి, పోలీసులకు సమాచారం అందించారు. ఐసీడీఎస్ అధికారులకు అక్కడకు చేరుకొని శిశువును స్వాధీనం చేసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు తరలించారు. అనంతరం మాతా, శిశు సంరక్షణ కేంద్రానికి అప్పగించారు.