రాష్ట్ర స్థాయి పురస్కారాలకు మన ఉపాధ్యాయులు
ఉమ్మడి జిల్లా నుంచి ఐదుగురి ఎంపిక
ఉత్తమ విద్యాబోధనకు సర్కార్ గుర్తింపు
నేడు గురుపూజోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం

ఖమ్మం ఎడ్యుకేషన్/ కొత్తగూడెం ఎడ్యుకేషన్, : మనకు జన్మనిచ్చింది తల్లిదండ్రులైతే విద్యావంతులుగా తీర్చి ప్రయోజకులను చేసేది మాత్రం గురువులే. అందుకే వారిని ‘మాతృ దేవోభవ.. పితృ దేవోభవ.. ఆచార్య దేవో భవ..’, ‘గురుభ్యోనమః’, ‘తస్మైశ్రీ గురువే నమః’ అంటూ పూజ్యులుగా భావిస్తాం. ‘దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే పురుడు పోసుకుంటుంది..’ అని నాడే చెప్పారు పెద్దలు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదద్దడంలో గురువుల కృషి ఎనలేనిది. మొత్తానికి గురువు ఒక మార్గదర్శకుడు. వారిని సత్కరించుకోవడం మన బాధ్యత. తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయుల సేవలను గుర్తించి ఏటా ‘రాష్ట్ర ఉత్తమ ఉపాధాయుల’ పురస్కారాలు అందజేస్తున్నది. దీనిలో భాగంగా ఉమ్మడి జిల్లా నుంచి మేడికొండ డాన్‌బాస్కో, పంజాల ఐలయ్య, కోపల్లి రత్నరాజు, జి.సంపత్‌కుమార్, ఏజీ ప్రభాకర్ పురస్కారాలకు ఎంపికయ్యారు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వారి సేవలు, విద్యాభివృద్ధికి చేసిన కృషిపై ‘నమస్తే’ ప్రత్యేక కథనం.
‘సర్వేపల్లి’ పేరుపై గురుపూజోత్సవం..
దేశం గర్వించదగిన ఉపాధ్యాయుడు, తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. మన సంస్కృతీ సంప్రదాయాలపై అపార గౌరవం ఉన్న ఆయన భవిష్యత్ తరాలకు వాటిని అందించాలని కృషి చేశారు. 1888 సెప్టెంబర్ 5వ తేదీన జన్మించిన ఆయన ఉన్నత చదువులు చదువుకున్నారు. ఉద్గ్రంథాలను ఔపోసన పట్టారు. ఉపాధ్యాయుడి నుంచి ఆయన ప్రస్థానం మొదలైంది. ఆయనే మన దేశ మొట్టమొదటి ఉప రాష్ట్రపతి. ఈ పదవి రెండుసార్లు అలంకరించారు. ఆ తర్వాత దేశానికి రెండో రాష్ట్రపతిగా సేవలు అందించారు. అప్పటి దేశంలో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితులను చక్కదిద్దారు. రాధాకృష్ణన్ దేశానికి అందించిన సేవలకు ప్రతీకగా ఏటా మనం గురుపూజోత్సవం నిర్వహిస్తాం. గురువులను సన్మానించుకుంటాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేస్తాయి.
కటిక పేదరికమే కసి పెంచింది..
నేను పుట్టింది ఇప్పటి ఏపీలోని కృషా ్ణజిల్లా కలగర మండలంలోని లక్ష్మీపురం. మాది అత్యంత నిరుపేద కుటుంబం. నాన్న ముత్తయ్య బుర్రకథలు చెప్పేవాడు. అమ్మ కనకరత్న గృహిణి. చిన్నప్పుడు రెండు పూటల తిండి కూడా సరిగా దొరికేది కాదు. ప్రాథమిక విద్య కోసం రెండు మైళ్లు నడిచి పొరుగూరుకు వెళ్లేవాడిని. ఆ పేదరికమే నాలో కసిని పెం చింది. బాగా చదువుకోవాలని ఉండేది. కష్టనష్టాలను అధిగమించి ఉస్మానియా యూనివర్సిటీలో బీఈడీ సీటు సాధించా. ఉపాధ్యాయుడినయ్యా. తొలి ఉద్యోగం వేంసూరులో మొదలైంది. ఇప్పుడు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయు డిగా ఎంపిక కావడమూ ఇదే మండలం నుంచి కావడం యాదృచ్ఛికం. అదృష్టం, మన లో పట్టుదల ఉంటే ఎలాంటి కష్టాలలైనా ఎదుర్కోవచ్చు. ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు. ఈ స్ఫూర్తితోనే నేను విజయాలు సాధించా.
సేవలకు గుర్తింపు లభించింది..
విద్యాబోధన నాకెంతో ఇష్టం. నిరుపేద విద్యార్థులకు పాఠాలు బోధించడం సంతృప్తినిచ్చింది. భౌతికశాస్త్రం ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు అర్థమయ్యేలా ప్రయోగాత్మకంగా బోధించడం నాకు చాలా ఇష్టం. కాకర్ల ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్‌గా పాఠశాల అభివృద్ధికి కృషి చేశాను. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాను. పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేకంగా విద్యార్థులకు అవగాహన కల్పించా. రాష్ట్రస్థాయిలో విద్యాశాఖ నిర్వహించే శిక్షణ కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లకు బాధ్యతవహించాను. రిసోర్స్ పర్సన్‌గా సేవలు అందించాను. కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఇంటింటికీ వెళ్లి డిజిటల్ పాఠాలపై అవగాహన కల్పించా. విద్యార్థులు, ఉపాధ్యాయుల సహకారంతో పాఠశాలలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేశా. పాఠశాల ప్రహరీ నిర్మాణానికి నా వంతు సాయం చేశా. నా కృషిని ప్రభుత్వం గుర్తించి అవార్డు ఎంపిక చేయడం ఎంతో సంతృప్తినిచ్చింది. – బి.సంపత్‌కుమార్, ఉపాధ్యాయుడు, కాకర్ల హైస్కూల్
విద్యాభివృద్ధికి బాధ్యతగా పనిచేశా..
నేను ఎమ్మెస్సీ జువాలజీ చదివా. ఎంఏలో తెలుగు పూర్తి చేశా, ఎంఈడీలో గోల్డ్‌మెడల్ సాధించా. విద్యాభివృద్ధి కోసం నా వంతు బాధ్యతగా విధులు నిర్వర్తించా. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేశా. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలనేది నా అభిలాష. అందుకు అనుగుణంగా పని చేశా. ఒకవైపు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే మరోవైపు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నా. లాక్డౌన్ సమయంలో ఆదివాసీ కుటుంబాలకు నిత్యావసరాలు అందించా. ఏటా విద్యార్థులకు అవసరమైన సామగ్రి అందిస్తున్నా. పాఠశాలలో పనిచేస్తున్న సమయంలో విద్యార్థులకు మైదానం కావాలని గుర్తించి సొంత నిధులతో 5 సెంట్ల భూమిని కొనుగోలు చేశా. అచ్యుతాపురం పాఠశాల అభివృద్ధికి రూ.3 లక్షల వరకు సొంతంగా నిధులు ఖర్చు చేశా. లాక్డౌన్ సమయంలో విద్యార్థుల ఇంటికి వెళ్లి వారి కుటుంబానికి కరోనాపై అవగాహన కల్పించా. తూరుబాక పంచాయతీలో హరితహారం కోసం సొంత నిధులతో మొక్కలు సమకూర్చా. విద్యార్థులు, గ్రామస్తులతో వేలాది మొక్కలు నాటించా. తండ్రి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. 2018లో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నా. తిరిగి ఇప్పుడు రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపిక కావడం ఆనందాన్నిచ్చింది. – ఏజే ప్రభాకర్, ఉపాధ్యాయుడు, అచ్యుతాపురం పాఠశాల
అమ్మే నాకు ప్రేరణ..
జీవితంలో విజయం సాధించానంటే అందుకు మా అమ్మ కొమురమ్మే ప్రేరణ. తానేమీ చదువుకోకున్నా నేను ఉన్నతస్థాయికి ఎదగాలని కోరుకునేది. అందుకు చదువే మార్గమనేది ఆమె నమ్మకం. నేను చదువుకునే రోజుల్లో రామిరెడ్డి అనే టీచర్ నన్ను బాగా ప్రోత్సహించేవారు. ఆయన ప్రోత్సాహంతో 1989లో డీఎస్సీ సాధించా. 1990 నుంచి ఉద్యోగ జీవితం ప్రారంభించా. ఒకవైపు పాఠాలు చెప్తూనే పిల్లల్లో సాహిత్యాభిలాష కలిగించా. కళలపై ఆసక్తి పెంచేందుకు కృషి చేశా. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించా. సైన్స్‌నూ ప్రయోగాత్మకంగా బోధించడానికి ఇష్టపడేవాడిని. వారిలో సైన్స్‌పై జిజ్ఞాసను కలిగించేవాడిని. మూఢనమ్మకాలు ప్రారదోలేందుకు జన విజ్ఞాన వేదికతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించా. సామాజిక సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొన్నా. ప్రభుత్వం నా కృషిని గుర్తించడం సంతృప్తినిచ్చింది.
-పంజాల ఐలయ్య, జడ్పీహెచ్ఎస్ మంగళగూడెం, ఖమ్మం రూరల్
విద్యతోనే జ్ఞాన జ్యోతి..
నా విద్యాభ్యాసమంతా ప్రభుత్వ సంస్థల్లోనే జరిగింది. విద్యతోనే సమాజంలో జ్ఞాన జ్యోతి వెలుగుతుందని నేను నమ్ముతా. ఇదే స్ఫూర్తితో పిల్లలకు పాఠాలు చెప్పాలని నిశ్చయించుకున్నాను. 1998లో డీఎస్సీ సాధించా. అప్పటి నుంచి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నా. సర్వీసులో ఎక్కువ కాలం ఏజెన్సీలో పని చేశా. గిరిజన విద్యార్థులకు విద్య అందించడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. పదేళ్ల నుంచి జీవశాస్త్రంలో రాష్ట్ర రిసోర్స్ పర్సన్‌గా వ్యవహరిస్తున్నా. వృత్తిపరంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూనే నిరుపేదలకు సాయం చేయాలని స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేస్తున్నాను. హరితహారంలో భాగంగా ఏటా మొక్కలు నాటుతున్నా. పేద విద్యార్థులకు పుస్తకాలు అందిస్తున్నా. తోచినంత ఆర్థిక సాయం చేస్తున్నా. ప్రభుత్వం నా సేవలను గుర్తించడం ఆనందాన్నిచ్చింది.
-డాన్‌బాస్కో, జీహెచ్ఎస్ శాంతినగర్ ఉపాధ్యాయుడు, ఖమ్మం
గురువులది గొప్ప స్థానం
ఖమ్మం ఎడ్యుకేషన్, సెప్టెంబర్ 4: మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని నేర్పిస్తూ తల్లిదండ్రుల తర్వాత అత్యంత గొప్పస్థానాన్ని ఉపాధ్యాయులు పొందారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెప్టెంబర్ 5న మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా టీచర్స్‌డే జరుపుకునే ఉపాధ్యాయులందరికీ గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు చెప్పారు. విద్య ద్వారానే మానవ అభివృద్ధి సాధ్యమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని అన్నారు.