వైరా/ వైరా టౌన్, మే 16 : రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. సోమవారం వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సంగ్రామ్ యాత్ర వలన ఒరిగిందేమి లేదని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకే మోదీ ప్రభుత్వం విషం చిమ్మేందుకు ప్రయత్నిస్తుందన్నారు.
మోడీ అనుచరులు అమిత్‌షా, కిషన్‌రెడ్డి, బండి సంజయ్ తెలంగాణ అభ్యున్నతికి అడ్డుతగిలి లేనిపోని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. బండి సంజయ్ తీరు మార్చుకోకపోతే ప్రజలే నీకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. దేశంలో అల్లకల్లోలం సృష్టించాలని మోదీ ప్రభుత్వం చూస్తుందన్నారు. జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, ఎంపీపీ వేల్పుల పావని, మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ బీబీకే.రత్నం, రైతుబంధు సమితి నాయకుడు మిట్టపల్లి నాగి, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు, దార్న రాజశేఖర్, నాయకులు కన్నెగంటి హుస్సేన్, ఏదునూరి శ్రీను, మోటపోతుల సురేశ్, లగడపాటి ప్రభాకర్‌రావు, మత్స్యశాఖ చైర్మన్ షేక్ రహీం పాల్గొన్నారు.