చర్ల, మే 13 : ఆదివాసీలకు అడివి నుంచి లభించే ఆదాయవనరుల్లో ఒకటైన తునికాకు సేకరణ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రారంభమైంది. ప్రతిఏడాది మే నెలలో తునికాకు సేకరిస్తారు. ఈ ఏడాది ఆకు విరివిగా లభిస్తున్నప్పటికీ రేటు విషయంలో సంతృప్తి చెందని ఛత్తీస్‌గఢ్ సరిహద్దు గ్రామాల ఆదివాసీలు కొందరు ఆకుసేకరణ పట్ల విముఖత చూపుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో తునికాకు 50 కట్టకు రూ.5.50 పైసలు చెల్లిస్తున్నారు. ఇక్కడ కేవలం రూ. 2.10 పైసలు మాత్రమే చెల్లిస్తున్నారు. అందువల్ల సరిహద్దు గ్రామాల ఆదివాసీలు ఆసక్తి చూపడంలేదు.
పొరుగు రాష్ట్రం కంటే రేటు తక్కువ..
పొరుగు రాష్ట్రంతో పోల్చితే తునికాకు కట్టకు ఇచ్చే రేటులో వ్యత్యాసం ప్రభావంతో అకు సేకరణ ఆలస్యమైందని తెలుస్తుంది. తిప్పాపురం తదితర సరిహద్దు గ్రామాల ఆదివాసీలు తునికాకు సేకరణ ప్రారంభించలేదు. కొన్ని సరిహద్దు గ్రామాల ఆదివాసీలు ఛత్తీస్‌గఢ్ గ్రామాలకు వలస వెళ్లి అక్కడ తునికాకు సేకరిస్తున్నట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో తునికాకు కార్మికులకు బోనస్ లేనందున కట్ట మద్దతు ధర ఎక్కువగా ఉందని, ఇక్కడ వారికి ఇచ్చే బోనస్‌తో కలిపితే ఛత్తీస్‌గఢ్ చెల్లించే దానికంటే ఎక్కువని తెలిసింది. ఈ విషయంపై ఆదివాసీలకు సరైన అవగాహన లేకపోవడంతో ఇక్కడ ఆకు సేకరణకు ముందుకు రావడంలేదని తెలిసింది.
కల్లాలు ప్రారంభించాం.. రేంజర్ ఉపేందర్, చర్ల.
ఈ ఏడాది తునికాకు సేకరణ ఈ నెల 6 నుంచి ప్రారంభించాం. చర్ల అటవీశాఖ పరిధిలో మొత్తం 33 కల్లాల ద్వారా 28 లక్షల కట్టలు (2,800 స్టాండర్డ్ బ్యాగ్స్ ) సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటివరకు 9 కల్లాలు ప్రారంభించాం. 6 లక్షల వరకు సేకరణ జరిగింది. నెలాఖరు నాటికి ఆకుసేకరణ జరుగుతుంది.