ఖమ్మం, మే 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హరిత తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా హరిత హారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. హరితహారంలో పెద్దఎత్తున మొక్కలు నాటి సంరక్షించడంతో ఏపుగా పెరిగి పచ్చదనంతో కనువిందు చేస్తున్నాయి. ఇదే స్ఫూర్తితో వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభమయ్యే ఎనిమిదో విడత కార్యక్ర మాన్ని విజయవంతం చేసేందుకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పర్యవేక్షణలో యంత్రాంగం సిద్ధమవుతున్నది. మోస్తరు వర్షాలు కురవగానే హరితహారం ప్రారంభిం చనున్నారు. ఈ సారి ఖమ్మం జిల్లాలో 50 లక్షల మొక్కలు నాటేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
స్వరాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఏడు విడుతలుగా నిర్వహించిన ‘హరితహారం’ విజయవంతమైంది. ఇదే స్ఫూర్తితో వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభమయ్యే ఎనిమిదో విడత కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పర్యవేక్షణలో యంత్రాంగం సిద్ధమవుతున్నది. మోస్తరు వర్షాలు కురవగానే కార్యక్రమం ప్రారంభం కానున్నది. ఈసారి జిల్లాలో 50 లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లావ్యాప్తంగా 589 పంచాయతీల్లోని నర్సరీల్లో పెరిగిన మొక్కలను హరితహారంలో నాటనున్నారు.
ప్రభుత్వశాఖల వారీగా లక్ష్యాలు.. : జిల్లాగ్రామీణాభివృద్ధిశాఖ, వ్యవసాయ, ఉద్యానవన, గనులు, పరిశ్రమలశాఖ, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, మున్సిపల్, మున్సిపాలిటీలు, నీటి పారుదలశాఖలు ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించనున్నాయి. హరితహారంలో సింగరేణి కూడా పాలుపంచుకుంటున్నది. జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అన్ని శాఖల కంటే ఎక్కువ మొక్కలు నాటనున్నది. మొక్కలు నాటడం, సంరక్షణ ఉపాధి హామీ పథకంలో భాగంగా కావడంతో కూలీలు పథకంలో భాగంగా మొక్కల నాటేందుకు గుంతలు తీయనున్నారు.
ఇంటింటికీ మొక్కలు.. : అధికారులు గ్రామాలు, పట్టణాల్లో రహదారుల పక్కన, కార్యాలయాల ఆవరణలో అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా విరివిగా మొక్కలు నాటించనున్నారు. ఈసారి ప్రత్యేకంగా అవెన్యూ ప్లాంటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఇప్పటికే ఈ అంశంపై కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ లక్ష్యాలకు అనుగుణంగా ఇప్పటికే నర్సరీల్లో మొక్కలు సిద్ధమయ్యాయి.
మొక్కల పెంపకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకూ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేయనున్నారు. ఖమ్మం నగర పాలకసంస్థతో పాటు మధిర, వైరా, సత్తుపల్లి మున్సిపాలిటీ అధికారులు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి నాగార్జున సాగర్ కెనాల్ బండ్స్పైన మొక్కలు నాటనున్నారు. ఉన్నతాధికారులు మొక్కల సంరక్షణ బాధ్యతలను లోకల్ అధికారులు, పాలకవర్గాలకు అప్పగించనున్నారు.
మొక్కలు నాటేందుకు సిద్ధం
ఎనిమిదో విడత హరితహారాన్ని విజయవంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశాల మేరకు మొక్కల నాటడం, వాటి సంరక్షణపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాం. కార్యక్రమానికి అవసరమైనన్ని మొక్కలను నర్సరీల్లో పెంచుతున్నాం. ఈసారి ప్రత్యేకంగా అవన్యూ ప్లాంటేషన్‌పై దృష్టి సారిస్తున్నాం. మొక్కలు పెంపకానికి ఉపాధి హామీ పథకం అనుసంధానం చేయడంతో మొక్కల సంరక్షణ మరింత సులువు కానున్నది.
–ఎం.విద్యాచందన, డీఆర్డీవో, ఖమ్మం