ఖమ్మం ఎడ్యుకేషన్, మే 12 : పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 23న పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఖమ్మం జిల్లాలో 104 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు 20 కేంద్రాలను సీ – కేటగిరీగా (సమస్యాత్మక) గుర్తించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించారు.
పదో తరగతి పరీక్షలను ఈ నెల 23 నుంచి నిర్వహించేందుకు విద్యాశాఖ పూర్తి ఏర్పా ట్లు చేసింది. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు ఏర్పడకుండా, అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సూచనలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈ దఫా నిర్వహిస్తున్న పరీక్షల్లో ప్రతి కేం ద్రంలోనూ విద్యాశాఖేతర అధికారులను సిట్టింగ్ స్కాడ్లుగా నియమించేందుకు ఒకటి రెండు రోజుల్లో కలెక్టర్ నుంచి విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు అందనున్నాయి.
ఆరోపణలకు తావివ్వకుండా పరీక్షలను విజయవంతం చేసేందుకు పర్యవేక్షణ అధికారులను నియమించారు. పది రోజుల్లో ప్రారంభమయ్యే ఈ పరీక్షలకు 104 కేంద్రాలు ఏ ర్పాటు చేశారు. వీటితోపాటు 20 కేంద్రాలను సీ – కేటగిరీ కేంద్రాలుగా (సమస్యాత్మక) గుర్తించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించారు. 23న ప్రారంభమైన పరీక్షలు 28తో ముగియనున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
కేంద్రానికో సిట్టింగ్ స్కాడ్..
ప్రతి విద్యార్థికి టెన్త్ పరీక్షలు ఎంతో కీలకం. తొలిసారి పబ్లిక్ పరీక్షలు రాయనుండడంతో కొందరికి కొంత బెరుకు ఉంటుంది. పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించిన సమయం నుంచి పరీక్ష ముగిసే వరకు నిబంధనల మేరకు వ్యవహరించాల్సి ఉంటుంది. విద్యార్థి భాగస్వామ్యంతోపాటు నిర్వహణలో కీలకమైన సీఎస్, డీవోలు వారి బాధ్యతలను నిర్వర్తిస్తుంటారు. వీరితోపాటు ఫ్లయింగ్ స్కాడ్లు, సిట్టింగ్ స్కాడ్లు పర్యవేక్షణ చేస్తుంటాయి. గతంలో కేవలం సీ సెంటర్లు, ఆరోపణలు ఉన్న కేంద్రాల్లోనే సిట్టింగ్ స్కాడ్లను నియమించేవారు. ఈ నేపథ్యంలో పరీక్షల పకడ్బందీ నిర్వహణకు కలెక్టర్ ప్రత్యేకంగా అన్ని కేంద్రాలకు సిట్టింగ్ స్కాడ్లను నియమించాలని ఆదేశించారు.
ఇతర విభాగాల అధికారులు..
జిల్లాలో టెన్త్ పరీక్షలకు 104 రెగ్యులర్ కేంద్రాల్లో వ్యవసాయ శాఖ విస్తరణాధికారులు (ఏఈవోలు), రెవెన్యూ, పీఆర్, వైద్య, ఆర్అండ్బీ శాఖల అధికారులను సిట్టింగ్ స్కాడ్లుగా నియమిస్తున్నారు. విద్యాశాఖతో సంబంధం లేని వారిని ఈ విధులకు కేటాయిస్తున్నారు. సిట్టింగ్ స్కాడ్‌ల ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. పరీక్షలకు రెండు రోజుల ముందు వీరిని పిలిపించి విధులపై సూచనలు చేసి అవగాహన కల్పిస్తారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎవరికీ ఫోన్ అనుమతి లేదు. కేంద్రాలను సందర్శించేందుకు డీఈవో లోపలికి వెళ్లే సమయంలోనూ ఫోన్ తీసుకేళ్లేందుకు అనుమతి లేదు.
నిఘా నేత్రాల మధ్య ప్రశ్నపత్రాలు..
ప్రశ్నపత్రాలను సీసీ కెమెరాల మధ్య తెరవనున్నారు. జిల్లాలో 104 కేంద్రాల్లో 12 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. వీటిల్లో ఏడు ప్రైవేట్ పాఠశాలలు. మిగిలిన 92 కేంద్రాలకు గాను సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 496 స్కూళ్ల నుంచి 17,623 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో బాలురు 8,932 మంది, బాలికలు 8,691 మంది.
విద్యార్థులకు సూచనలు..
విద్యార్థి హాల్‌టికెట్‌పై ఉన్న వివరాల్లో ఏమైనా తప్పులుంటే ప్రధానోపాధ్యాయులకు తెలియజేయాలి.
ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే పరీక్ష కోసం ఉదయం 8:30 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు.
పరీక్ష ప్రారంభమైనప్పటికీ ఐదు నిమిషాల ఆలస్యంతో విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు.
ఓఎంఆర్‌పై ఉన్న వివరాలు సరిచూసుకుని ప్రధాన జవాబు పత్రానికి పిన్ మిషన్‌తో సీల్ వేయాలి.
ఓఎంఆర్ షీట్ పార్ట్-1లో సూచించిన విధంగా బాక్స్‌లో విద్యార్థులు పూర్తి సంతకం చేయాలి.
ప్రధాన జవాబు పత్రం, అదనపు జవాబు పత్రం, గ్రాఫ్, మ్యాప్‌పై ఎక్కడా రోల్ నెంబర్ వేయకూడదు. రోల్ నెంబర్ వేసిన జవాబు పత్రాలను మాల్ ప్రాక్టీస్‌గా పరిగణిస్తారు.
ప్రతి సమాధాన పత్రానికి కేటాయించిన క్రమ సంఖ్యను ఓఎంఆర్ షీటులోని పార్ట్-1లో సూచించిన బాక్స్‌లో తప్పక నమోదు చేయాలి.
జవాబుపత్రం రెండు వైపులా బ్లూ, బ్లాక్ కలర్ ఇంకు పెన్నుతో స్పష్టంగా ప్రశ్నల నెంబర్లు తెలుపుతూ సమాధానాలు రాయాలి.
ఓఎంఆర్‌లో వివరాలు పూర్తి చేశాక పరీక్షా పత్రం పూర్తిగా చదివి అవగాహన చేసుకో వడానికి 15 నిమిషాల సమయం కేటాయించుకోవచ్చు.
విద్యార్థులు స్కూల్ యూనిఫాంలో కాకుండా సివిల్ డ్రెస్‌లో పరీక్షలకు హాజరుకావాలని అధికారులు నిబంధన విధించారు.
విద్యార్థులు చేయకూడనవి..
జవాబు పత్రంపై ఎలాంటి నిషిద్ధమైన పదజాలాలను ఉపయోగించకూడదు. అలా చేస్తే విద్యా చట్టం 25/1997 కింద చర్య తీసుకుంటారు.
పరీక్షల్లో సమాధానాలను గుర్తించేందుకు ఉపయోగపడే ఏ సామగ్రినీ తీసుకెళ్ల కూడదు.
సెల్ఫోన్లు, పేజర్లు, బ్లూటూత్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష హాల్లోకి తీసుకెళ్లడం నిషేధం.
పరీక్ష జరుగుతున్న సమయంలో పరీక్షలు రాసే తోటి విద్యార్థులతో ఎలాంటి పరిస్థితుల్లోనూ మాట్లాడకూడదు.
బిట్ పేపర్, మ్యాప్, గ్రాఫ్ ప్రధాన జవాబు పత్రానికి జత చేయకుండా విద్యార్థి తన వెంట తీసుకెళ్లకూడదు.