కల్లూరు రూరల్, మే 12 : రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం వారిది. పనిచేయకుంటే ఆ పూట గాసం కష్టమే. అంతటి పేద కుటుబంలో పుట్టిన అతడికి అంగవైకల్యం పెనుశాపమైంది. చదువుకోవాలనే తపన ఉన్నా ఆర్థిక ఇబ్బందులు పెనుభారమయ్యాయి. చేయూతనిచ్చే చేయి ఉంటే ఉన్నత విద్యలోనూ రాణిస్తానంటున్నాడు ఆ బాలుడు. అతడే పరగడుపు నవీన్‌కుమార్. కల్లూరు మండలం చండ్రుపట్ల గ్రామానికి చెందిన నిరుపేద కూలీలు పరగడుపు లక్ష్మయ్య, నాగమణి దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో పెద్ద కుమారుడు నవీన్‌కుమార్. చిన్నతనం నుంచే అతడు మూడు అడుగుల ఎత్తు కలిగి మరుగుజ్జు తనంతో బాధపడుతున్నాడు. స్వగ్రామమైన చండ్రుపట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టెన్త్ వరకూ చదివిన నవీన్‌కుమార్.. 8.5 జీపీఏతో ఉత్తీర్ణుడయ్యాడు. కల్లూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సీఈసీలో చేరాడు. అతడి చెల్లి కల్లూరు గురుకులంలో పదో తరగతి చదువుతోంది.
ఈ నేపథ్యంలో నవీన్‌కుమార్ తల్లికి అనారోగ్యం. తండ్రి ఒక్కడే పనికి వెళ్లాలి. అతడు పనికి వెళ్లకపోతే పూట గడవని పరిస్థితి. కనీసం ఉండడానికి సరైన ఇల్లు కూడా లేదు వారికి. నవీన్‌కుమార్‌కు మాత్రం ఉన్నత చదువులపై అమితాసక్తి. కష్టపడి చదివి జీవితంలో ఉన్నతస్థాయికి ఎదిగి తనలా మరుగుజ్జు తనంలో బాధపడుతున్న వారికి అండగా ఉండాలన్నది అతడి ఆకాంక్ష. కానీ ఆర్థిక ఇబ్బందులు ఆయనకు శాపంగా మారాయి. బస్సు సౌకర్యంలేని ఆ మార్గంలో ప్రతి రోజూ చండ్రుపట్ల నుంచి కల్లూరు కళాశాలకు వచ్చి పోవాలంటే రూ.100 ఖర్చవుతోంది. పూట గడవడమే కష్టంగా ఉండే ఆ ఇంట్లో ఇతడి రవాణా ఖర్చులకే రూ.100 కేటాయించడం కష్టతరమవుతోంది. పొద్దంతా చెమటోడ్చినా పూట గాసం వెళ్లదీయడానికే కష్టమవుతున్న ఈ పరిస్థితుల్లో తన కుమారుడికి రోజుకు అంతంత కేటాయించడం తన వల్ల కావట్లేదంటున్నాడు అతడి తండ్రి. రోజూ పని దొరికే పరిస్థితి కూడా లేని రోజుల్లో మున్ముందు ఉన్నత చదువులకు ఇంకెంత ఇబ్బంది అవుతుందోనంటున్నాడతడు.
కలెక్టర్ కావాలనుంది..
మరుగుజ్జు తనం, కుటుంబ పేదరికం శాపంలా మారాయి. చదువుకోవడమంటే నాకు ఎంతో ఇష్టం. దాతలు సహాయం చేస్తే మంచిగా చదువుకొని కలెక్టర్‌నవుతా. ఉన్నత చదువులు చదువుకొని అంగవైకల్యం అడ్డు కాదని నిరూపిస్తా. చదువుకునేందుకు నాలాంటి మరుగుజ్జులు ఇబ్బంది పడకుండా సేవచేస్తా. -నవీన్‌కుమార్