సత్తుపల్లి టౌన్, మే 12: వైద్య రంగంలో కీలకమైన నర్సుల వృత్తికి గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకొచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ సేవలు మరువలేనివని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా గురువారం సత్తుపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నర్సులను శాలువాలతో సత్కరించారు. అనంతరం లేడీ ఆఫ్ ది ల్యాంప్ అయిన ఫ్లోరెన్స్ నైటింగేల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసుపత్రుల్లో రోగులకు నిస్వార్థంగా సేవలందిస్తూ ప్రతి ఒక్కరినీ తమ సొంత వారిలా చూసుకునే నర్సులు ఎంతో గొప్పవారని అన్నారు. కొవిడ్ సమయంలో హీరోల మాదిరిగా సేవలందించారని గుర్తుచేశారు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో నర్సులదే ముఖ్య పాత్ర అని అభివర్ణించారు.
వీరందరికీ భగవంతుడు మరింత శక్తిని అందించి, వారి ద్వారా రోగులకు విశేషమైన సేవలందించేలా చూడాలని భగవంతుడిని వేడుకున్నారు. కరోనా సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నో సేవలందించిన గొప్ప సేవామూర్తులు నర్సులని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుళ్ల కృష్ణయ్య, కొత్తగూడెం డీఎంహెచ్వో భాస్కర్నాయక్, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎల్.వెంకటేశ్వర్లు, ప్రభుత్వ వైద్యులు విజయలక్ష్మి, ప్రేమలత, అద్దంకి అనిల్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రఫీ, గండ్ర రఘు, ఏఎన్ఎం, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.