ఖమ్మం ఎడ్యుకేషన్, మే 11: బడి మానేసిన విద్యార్థుల వివరాలు సేకరించి వారిని పాఠశాలలో చేర్పించేందుకు సమగ్ర శిక్షా అభియాన్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో అర్బన్, రూరల్ ప్రాంతాల వారీగా సీఆర్పీలు సర్వే చేస్తున్నారు. 6 నుంచి 14 ఏళ్లు, 15 నుంచి 19 ఏళ్లలోపు బాలబాలికలను గుర్తించి. వారి వివరాలను పోర్టల్‌లో పొందు పరుస్తారు. వచ్చే విద్యా సంవత్సరంలో వారి వయస్సును బట్టి ఆయా తరగతుల్లో చేర్పిస్తారు. అయితే, ఈ సారి సర్వేలో పిల్లల ఆధార్, వారి తల్లిదండ్రుల ఫోన్‌నంబర్ వంటి వివరాలను సేకరిస్తున్నారు.
ఏటా బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్చేందుకు సమగ్ర శిక్షా అభియాన్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. సమైక్య పాలనలో సర్వే నామమాత్రంగా చేయడం లేదా ఇంట్లో కూర్చొని లెక్కలు వేసి చేతులు దులుపుకోవడం వంటివి చేసేవారు. తెలంగాణలో మాత్రం బడి బయట పిల్లలను గుర్తించి వారిని బడిలో చేర్పించేందుకు నిర్వహిస్తున్న సర్వేలు సత్ఫలితాలనిస్తున్నాయి. సీఆర్పీలు క్షేత్రసస్థ్ధాయిలో తిరిగి బడి బయటి పిల్లల వివరాలు సేకరిస్తున్నారు. బడిలో చేరిన పిల్లల వివరాలను చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేయడం నుంచి విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు వారు బడిలో ఉండేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సర్వే జరుగుతున్న తీరును ప్రతి రోజూ సెక్టోరల్ అధికారులు పర్యవేక్షించడంతోపాటు వారి నుంచి డీఈవో వివరాలు సేకరిస్తున్నారు. బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలనే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా బడి మానేసిన పిల్లలను తిరిగి బడుల్లో చేర్పించి ఉచిత నిర్బంధ విద్యను అమలు చేసేలా సర్వే చేస్తున్నారు.
31 వరకూ సర్వే..
బడి మానేసిన విద్యార్థుల వివరాలు సేకరించేందుకు చేపట్టిన సర్వేలో సీఆర్పీలు (క్లస్టర్ రీసోర్స్ పర్సన్లు) నిర్వర్తించాల్సిన విధులపై డీఈవో సిగసారపు యాదయ్య ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. జూమ్ ద్వారా నిర్వహించిన ఈ సమావేశంలో ఉన్నతాధికారులు సూచించిన మార్గదర్శకాలను వివరించారు. విద్యార్థుల వివరాలను చైల్డ్ ఇన్ఫో, ప్రబంధ్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాల్సిన ఆవశ్యకత గురించి తెలియజేశారు. సూచించిన ప్రాంతాల్లో ఈ నెల 31లోగా సర్వే పూర్తి చేయాలని సీఆర్పీలకు సూచించారు. సర్వేలో సేకరించిన బడి మానేసిన పిల్లల వివరాలను పోర్టల్‌లో పొందుపర్చాల్సి ఉంది. పూర్తి స్థాయి నివేదికను ఈ నెల 31లోగా విద్యాశాఖ కమిషనర్‌కు అందజేయాల్సి ఉంది. ప్రభుత్వం చదువుకునే విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరించి ఏ ఒక్క విద్యార్థి బడి మానేయకుండా చర్యలు తీసుకుంటారు. ఈ సర్వేలో పిల్లల ఆధార్ వివరాలు, వారి తల్లిదండ్రుల ఫోన్ నెంబర్ వంటి వివరాలను సేకరించాలని డీఈవో సూచించారు.
పకడ్బందీగా వివరాల సేకరణ..
ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో అర్బన్, రూరల్ ప్రాంతాల వారీగా సీఆర్పీలు సర్వే చేస్తారు. 6 నుంచి 14 ఏళ్లు, 15 నుంచి 19 ఏళ్లలోపు బాలబాలికలను గుర్తిస్తారు. పిల్లల వివరాలు సేకరించి కంప్యూటర్లో పొందుపరిచి వచ్చే విద్యా సంవత్సరంలో వారి వయసును బట్టి ఆయా తరగతుల్లో చేర్పిస్తారు. 2021 జూన్‌లో సర్వే నిర్వహించిన సీఆర్పీలు 8 మండలాల్లో మాత్రమే బడి బయట పిల్లలు ఉన్నారని, మిగిలిన మండలాల్లో లేరని నివేదిక ఇచ్చారు. గత సర్వేలో గుర్తించిన విద్యార్థుల వివరాలను పరిశీలించడంతోపాటు బడి మానేసిన వారిని గుర్తించడం, తల్లిదండ్రులు చేస్తున్న పని, బడికి వెళ్లకపోవడానికి కారణాలు, ఏ తరగతిలో మానేశారు. నివాస చిరునామా ఏంటి అనే వివరాలు సేకరిస్తున్నారు.
తగ్గుతున్న డ్రాపౌట్స్..
ఏటా బడి మానేసిన పిల్లలపై నిర్వహిస్తున్న సర్వేలో ప్రభుత్వం తీసుకుంటున్న ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2018-19 విద్యా సంవత్సరంలో రూరల్ ప్రాంతాల్లో డ్రాపౌట్స్ 213 మంది ఉండగా, అర్బన్ ప్రాంతాల్లో 150 మంది వరకు ఉన్నారు. 2019-20 విద్యాసంవత్సరంలో రూరల్ ప్రాంతాల్లో బడి మానేసిన పిల్లలు 113 మంది ఉండగా, అర్బన్ ప్రాంతాల్లో 106 మంది ఉన్నారు. 2020-21 విద్యా సంవత్సరంలో భాగంగా నిర్వహించిన సర్వేలో రూరల్, అర్బన్ ప్రాంతాల్లో కలిపి కేవలం 44 మంది విద్యార్థులు మాత్రమే బడి మానేసిన పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. బడి బయట పిల్లలను గుర్తించిన వారిని జూన్ 13న వేసవి సెలవుల అనంతరం బడుల్లో చేర్చే విధంగా చర్యలు తీసుకోనున్నారు. పెనుబల్లి మండలంలో ఇప్పటికే బడి బయట ఆరుగురు పిల్లలను గుర్తించారు.