భద్రాద్రి కొత్తగూడెం, మే 11 (నమస్తే తెలంగాణ);గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సీఎం కేసీఆర్ పాలనలో సాకారమవుతున్నది. రాష్ట్రంలో ఏ పల్లెకెళ్లినా.. ఏప్రాంతాన్ని సందర్శించినా.. సకల వసతులు స్వాగతం పలుకుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మ కంగా చేపట్టిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. పల్లెల్లో నెలకొన్న సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతుండడంతో గ్రామస్తులు సైతం ఇంటి, ఆస్తి, నీటి పన్నులు చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్నారు. గ్రామానికి ఆదాయం సమకూరితేనే అభివృద్ధి సాధిస్తామనే అవగాహనతో ప్రజలు స్వచ్ఛం దంగా పన్నులు చెల్లిస్తున్నారు. గతంలో పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు కాళ్లరిగేలా తిరిగినా వసూలు కాని పన్నులు.. ఇప్పడు వసూలవుతున్నాయి. భద్రాద్రి జిల్లాలో 22 మండలాలు ఉండగా.. 19 మండలాల్లో వంద శాతం పన్నులు వసూలయ్యాయి. మిగిలిన మూడు పంచాయతీల్లోనూ 98 శాతం పైగా టార్గెట్ పూర్తయింది. మొత్తం రూ.13.14 కోట్ల పన్నులు వసూలు కావాల్సి ఉండగా.. అధికారులు ఇప్పటి వరకు రూ.13.03 కోట్లు వసూలు చేశారు.
‘పల్లెప్రగతి’ గ్రామసీమల ముఖచిత్రాన్ని మార్చివేసింది. గ్రామాల్లో వసతులు మెరుగుపడడంతో గ్రామస్తులు ఇంటి, ఆస్తి, నీటి పన్నులు చెల్లించేందుకు ముందుకొస్తున్నారు. డిమాండ్ నోటీసు ఇవ్వగానే పంచాయతీ కార్యాలయానికి వచ్చి మరీ పన్నులు చెల్లించి వెళ్తున్నారు. ఇంతకుముందు పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు కాళ్లరిగేలా తిరిగినా వసూలు కాని పన్నులు ఇప్పడు క్షణాల వ్యవధిలో వసూలవుతున్నాయి. భద్రాద్రి జిల్లాలో 22 మండలాలుండగా అందులో 19 మండలాల్లో వంద శాతం పన్నులు వసూలు కావడం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది.
సారూ.. ఇంటి పన్ను కట్టించుకోండి..
ఇంతకుముందు కాళ్లరిగేలా ఏళ్ల తరబడి తిరిగినా ఇంటి పన్నులు వసూలయ్యేవి కావు. సౌకర్యాలు కల్పించకుండా పన్నుల వసూళ్లకు వచ్చిన సిబ్బందిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసేవారు. చాలామంది సకాలంలో పన్నులు చెల్లించేవారు కాదు. దీంతో పంచాయతీ కార్యదర్శులు తిరగలేక మొండిబకాయిలను వదిలేసిన సందర్భాలు అనేకం. నల్లాలు రాక, మురుగు కాలువలు లేక, ఉన్నవాటిలో పూడిక తీయక, మోకాలి లోతున్న బురద రోడ్లపై తిరగలేక గ్రామస్తులు అవస్థలు పడేవాళ్లు. ఈ క్రమంలో బిల్ కలెక్టర్లు పన్నుల వసూళ్లకు వెళ్తే గ్రామస్తులు తిట్టిపోసేవాళ్లు. ఒక్కోసారి 55 శాతానికి మించి వసూళ్లయ్యేవి కావు. ఇంకా కొన్ని చోట్ల పంచాయతీ కార్యదర్శులు సొంతంగా జమ చేసేవాళ్లు.
తెలంగాణ ఆవిర్భవించాక ఇలాంటి పరిస్థితులు కనుమరుగయ్యాయి. పల్లె ప్రగతి, నూతన పంచాయతీరాజ్ చట్టంతో చిన్న గ్రామాలకూ పాలన చేరువ కావడం, పూర్తిస్థాయి సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పల్లెలు ప్రగతిసీమలుగా రూపాంతరం చెందాయి. ప్రతి ఇంటికీ నల్లా, గల్లీగల్లీకీ సిమెంట్ రోడ్లు, ప్రతి వీధిలోనూ విద్యుత్ దీపాలు, వీధుల్లో చెత్తను తొలగించేందుకు ట్రాక్టర్లు, తరలించేందుకు డంపింగ్ యార్డులు, ఆహ్లాదాన్ని పంచేందుకు పల్లె ప్రకృతి వనాలు, మొక్కలకు నీళ్లు పట్టేందుకు ట్యాంకర్లు, చివరి మజిలీ కోసం వైకంఠధామాలు వంటివి ప్రతి గ్రామంలోనూ అందుబాటులోకి వచ్చాయి.
దీంతో పన్నుల విషయంలో బకాయిల గొడవే లేకుండాపోయింది. నూటికి నూరు శాతం వసూళ్లవుతున్నాయి. భద్రాద్రి జిల్లాలో ఒకప్పుడు 205గా ఉన్న పెద్ద పంచాయతీలను 481 చిన్న పంచాయతీలుగా విస్తరించడం, ప్రతి పంచాయతీకి కార్యదర్శిని నియమించడం, క్రమం తప్పకుండా నిధులు కేటాయించడం వంటి చర్యలతో పల్లెలన్నీ అభివృద్ధి బాటపట్టాయి. దీంతో ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి పన్నులు చెల్సిస్తున్నారు.
19 మండలాల్లో వందశాతం వసూళ్లు..
గ్రామాల్లో సౌకర్యాలు మెరుగుపడడంతో ఇంటి పన్నులు బకాయిల పెండింగ్ లేకపోవడం గమనార్హం. భద్రాద్రి జిల్లాలో 22 మండలాలుండగా అందులో 19 మండలాల్లో వంద శాతం ఇంటి పన్నులు వసూలవడం గమనార్హం. మిగిలిన మూడు పంచాయతీల్లోనూ 98 శాతం పైగా టార్గెట్ పూర్తయింది. మొత్తం రూ.13.14 కోట్ల ట్యాక్స్ వసూళ్లు కావాల్సి ఉండగా ఇప్పటికే 13.03 కోట్లు వసూలయ్యాయి.
ఆఫీసుకెళ్లి పన్ను కట్టి వస్తా..
డిమాండ్ నోటీసు ఇచ్చిన వెంటనే పంచాయతీ కార్యాలయానికి వెళ్లి ఇంటి పన్ను కట్టి రసీదు తెచ్చుకుంటాను. మా గ్రామంలోని ప్రతి వీధిలోనూ రోడ్లు వేశారు. సైడ్ కాలువలూ నిర్మించారు. గతంలో వర్షం వస్తే మా వీధుల్లో నడిచే వీలుపడేది కాదు. ఇప్పుడు సీసీ రోడ్లు వేశాక ఆ ఇబ్బందులు తొలగిపోయాయి. ఇంటికి మంచినీళ్లొస్తున్నాయి. వీధిలో ఎల్ఈడీ బల్బులు వెలుగుతున్నాయి. ఇంతకంటే ఏం కావాలి. అందుకే వారు అడగక ముందే ఇంటి పన్ను కట్టి వస్తున్నాం.
–మాచర్ల చిట్టెమ్మ, శ్రీనగర్ కాలనీ, లక్ష్మీదేవిపల్లి మండలం
వందశాతం వసూలవుతున్నాయి..
గతంలో ఇంటి పన్నులు వసూలు చేయాలంటే కొంత కష్టపడాల్సి వచ్చేది. పల్లెల్లో సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో గ్రామస్తులు కూడా పన్నులు సరిగా కట్టేవాళ్లు కాదు. పల్లె ప్రగతి, నూతన పంచాయతీరాజ్ చట్టం వచ్చాక ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వసతుల కల్పనలోనూ, పన్నుల వసూళ్లలోని మార్పులు వచ్చాయి. నిధులు పుష్కలంగా ఉన్నాయి. అభివృద్ధి బాగా జరిగింది. శానిటేషన్ విషయంలో ఢోకా లేదు. కాలువలు నిర్మించడంతో ఎక్కడా మురుగు సమస్య లేకుండా పోయింది. పల్లెలు పకృతి వనాలతో కళకళలాడుతున్నాయి.
–రమాకాంత్, డీపీవో. భద్రాద్రి కొత్తగూడెం