పెనుబల్లి, మే 11: జీవితంలో మళ్లీ రాని అవకాశం ఇదని, దీనిని పూర్తిగా అర్థం చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సూచించారు. ఇప్పటి వరకూ కూలీలుగా, మేస్త్రీలుగా ఉన్న దళితులంతా ఇక నుంచి యజమానులు కావాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ ఆశయమని అన్నారు. మండలంలోని కొత్త కారాయిగూడెంలో మోడల్ యూనిట్‌గా ఎంపిక చేసిన 73 లబ్ధిదారులకు కలెక్టర్ వీపీ గౌతమ్‌తో కలిసి బుధవారం ఆయన అవగాహన కల్పించారు. ముందుగా దళితకాలనీలో లబ్ధిదారులతో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. దళితుల అభ్యున్నతి కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని రూపొందించారని అన్నారు. ఈ పథకం ద్వారా ఆర్థిక అసమానతలు తొలగిపోవాలన్నదే ఆయన ఆకాంక్ష అని చెప్పారు.
ఇలాంటి పథకం మరెక్కడా లేదు..: కలెక్టర్
దళితబంధు లాంటి పథకం దేశంలో మరెక్కడా లేదని కలెక్టర్ వీపీ గౌతమ్ గుర్తుచేశారు. నేడు దళితబంధు లబ్ధిదారుల ఖాతాల్లో రూ.లక్షలు ఉన్నాయని, వాటిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకొంటే మున్ముందు రూ.కోట్లు ఉండాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం, భవిష్యత్తులో ప్రజలకు ఏమేమి అవసరాలు ఉంటాయో గుర్తించి అందుకు అనుగుణంగా యూనిట్లను ఎంపిక చేసుకొని ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు.
అదనపు కలెక్టర్ మధుసూదన్, ఆర్డీవో సూర్యనారాయణ, సర్పంచ్ దొడ్డపనేని శ్రీదేవి, ఎంపీపీ లక్కినేని అలేఖ్య, జడ్పీటీసీ చెక్కిలాల మోహన్‌రావు, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీవో కావూరి మహాలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ చెక్కిలాల లక్ష్మణ్‌రావు, ప్రత్యేకాధికారి నాగేశ్వరరావు, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు మందడపు అశోక్‌కుమార్, ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు కనగాల సురేశ్‌బాబు, నీలాద్రి చైర్మన్ పసుమర్తి వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు కనగాల వెంకటరావు, భూక్యా ప్రసాద్, చీకటి రామారావు, దొడ్డపనేని రవి, తాళ్లూరి శేఖర్‌రావు, బెల్లంకొండ చలపతిరావు, లగడపాటి శ్రీను, కర్నాటి వీరభద్రారెడ్డి, కొత్తగుండ్ల అప్పారావు, గువ్వల వెంకటరెడ్డి, కాకా సీతారాములు, వంగా సురేశ్, కోటా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.