లక్ష్మీదేవిపల్లి, మే 11: వైశాఖ శుద్ధ దశమి బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురం గ్రామంలో ఇదే గ్రామానికి చెందిన కొండపల్లి సాయిగోపాల్ – సుజాత దంపతులు సామూహిక వివాహాల వేడుకను నిర్వహించారు. తొలుత ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శ్రీవేంకటేశ్వర స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. అనంతరం సామూహిక వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించి నూతన వస్ర్తాలను బహూకరించారు. నూరేళ్లూ సుఖ సంతోషాలతో మెలగాలని ఆకాంక్షించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 49 జంటలకు సామూహిక వివాహాలు జరిగాయి.
అనంతరం సింగరేణి జీఎం పర్సనల్ వెల్ఫేర్ అండ్ సీఎస్ఆర్ కే.బసవయ్య పాల్గొని వేంకటేశ్వర స్వామికి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇలాంటి సామూహిక కార్యక్రమాలు మరెన్నో జరగాలని ఆకాంక్షించారు. ఈ సామూహిక వివాహాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్న కొండపల్లి సాయిగోపాల్ – సుజాత దంపతులను, వారి బృందాన్ని అభినందించారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. డీజీఎం పర్సనల్ ధన్పాల్ శ్రీనివాస్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.