భద్రాద్రి కొత్తగూడెం మే 11 (నమస్తే తెలంగాణ) : ప్రసవానికి వచ్చిన ప్రతి గర్భిణికీ సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను తీయడం ఆనవాయితీగా వస్తోందని, ముహూర్తాలు చూసి మరీ సీ సెక్షన్ చేస్తున్నారని, వీటిని ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు తగ్గించుకోవాలని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ సూచించారు. ఐసీడీఎస్, వైద్యరోగ్యశాఖ, ప్రైవేటు ఆసుపత్రుల గైనకాలజిస్టులతో కొత్తగూడెం క్లబ్లో వేర్వేరుగా నిర్వహించి ప్రత్యేక సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 65 శాతం నార్మల్ డెలివరీలు అవుతుంటే ప్రైవేటులో 32 శాతమే నార్మల్ చేస్తున్నారని అన్నారు. మిగతా 68 శాతం కోత ఆపరేషన్లు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.
అవసరం లేకున్నా ఆపరేషన్లు చేయడం వల్ల తల్లీబిడ్డలకు అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. దీనిపై జిల్లా వైద్యాధికారి ప్రైవేటు ఆసుపత్రులను ఆడిట్ చేయాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఆపరేషన్లు చేయకూడదన్నారు. భద్రాచలంలో జయభారతి, కొత్తగూడెంలో లలిత పద్మావతి, శ్యామలాంబ, శ్రావ్య నర్సింగ్, క్రాంతి, రాజశేఖర్, భవానీ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. భద్రాచలం సరోజిని ఆసుపత్రిలో ఎక్కువగా నార్మల్ డెలివరీలు చేసినందుకు డాక్టర్ సరోజినిని అభినందించారు.
పుట్టుకకు ముహూర్తాలు చూడకండి..
చావుకు, పుట్టకకు మంచి చెడు ఉండదని కలెక్టర్ అన్నారు. డెలివరీలకు మూహూర్తాలూ చూడాలంటూ ఎవరైనా వస్తే అలాంటి ముహూర్తాలు ఉండవని వారికి చెప్పాలని పురోహితులకు సూచించారు.
శిశు మరణాలు జరగడానికి వీల్లేదు..
ప్రభుత్వ ఆసుపత్రుల్లో శిశు మరణాలు ఉండకూడదని ప్రభుత్వ వైద్యుల సమీక్షలో కలెక్టర్ సూచించారు. శిశు మరణాలు లేకుండా చాలెంజ్‌గా తీసుకొని పనిచేయాలన్నారు. గర్భిణి చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చిన దగ్గర నుంచి ఆమె ఆరోగ్యాన్ని ఫాలోఅప్ చేయాలని సూచించారు. చర్ల, మణుగూరు ఆసుపత్రుల్లో సౌకర్యాల కోసం నిధులు మంజూరు చేస్తామన్నారు. కాయకల్ప, ఎన్ క్వాష్ అవార్డులకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇమ్యూనైజేషన్ ఇప్పటికీ 81 శాతం ఉందని, అది వందశాతం రావడానికి స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ప్రతి చిన్నారికీ తప్పనిసరిగా టీకా ఇవ్వాలని, రామవరం ఎంసీహెచ్‌కు అత్యవసర కేసులు మాత్రమే పంపాలని సూచించారు.
పోషణ లోపాన్ని తగ్గించాలి..
చిన్నారులకు తీవ్ర, అతితీవ్ర లోపం లేకుండా చూడాలన్నారు. పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్నారు. అంగన్వాడీల్లో న్యూట్రీ గార్డెన్ పెంచాలన్నారు. నిరుడు పోషణ లోపం గురించి చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిచ్చాయని, మళ్లీ అదేవిధంగా పనిచేసి మంచి పేరుతేవాలని ఆకాంక్షించారు. ప్రతీ బుధవారం అంగన్వాడీ కేంద్రాల్లో తల్లులకు అవగాహన కల్పించాలని సూచించారు. డీఎంహెచ్‌వో డాక్టర్ దయానందస్వామి, మెడికల్ ఆసుపత్రి ప్రిన్సిపాల్ లక్ష్మణ్‌రావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ ముక్కంటేశ్వరరావు, జిల్లా సంక్షేమ అధికారి వరలక్ష్మి పాల్గొన్నారు.