ఖమ్మం వ్యవసాయం, మే 11: రెండు రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అసన్ తుఫాన్ ప్రభావం బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపింది. కొద్ది రోజుల నుంచి రికార్డు స్థాయిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే అసన్ తుఫాన్ ప్రభావంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం పూర్తిగా చల్లబడింది. దీనికి తోడు బలమైన ఈదురుగాలులు వీచాయి. మరోవైపు దట్టమైన మేఘాలు అలుముకోవడంతో ఏ నిమిషమైనా భారీ వర్షం కురిసే అవకాశం కనిపించింది.
దీంతో కొనుగోలు కేంద్రాలకు, వ్యవసాయ మార్కెట్లకు పంటను తీసుకొచ్చిన రైతుల్లో ఆందోళన వ్యక్తమైంది. అయితే మార్కెట్లో సకాలంలో క్రయవిక్రయాలు పూర్తి కావడంతో అధికారులు, వ్యాపారులు ఊపిరిపీల్చుకున్నారు. చల్లబడిన వాతావణంతో ఖమ్మం నగరంతోపాటు ఆయా పట్టణాల్లో ప్రజలు మధ్యాహ్నం వేళ సైతం బయటకు వచ్చారు. పాదచారులు, ప్రయాణికులతో నగరంలో రద్దీ కన్పించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడి జాడ కనిపించలేదు. రానున్న మూడు రోజుల్లో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.